త్వరలో కొత్త రూల్స్ : ఫోన్ కాల్స్.. ఇక ఫ్రీ కాదు

  • Published By: madhu ,Published On : November 15, 2019 / 12:15 PM IST
త్వరలో కొత్త రూల్స్ : ఫోన్ కాల్స్.. ఇక ఫ్రీ కాదు

ఫోన్‌ కాల్స్‌ ఇక ఎంత మాత్రం ఫ్రీ కాదు. అవును మీరు వింటున్నది నిజమే. మీరు ఏ నెట్‌వర్క్‌ వాడుతున్నారో.. ఏ నెట్ వర్క్‌కు ఫోన్ చేస్తున్నారనేది సంబంధం లేదు. కాల్ వెళ్లిందా.. పైసలు కట్టాల్సిందే. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డేటా వాడినా సరే.. వాడకానికి తగ్గట్టు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఔట్ గోయింగ్ ఫోన్ కాల్ చేసిన తర్వాత.. మీ బ్యాలెన్స్ కట్ అయ్యిందనే మెసేజ్ త్వరలోనే చూడబోతున్నారు. అన్ని నెట్ వర్క్‌లు ఇదే రూల్ పాటించబోతున్నాయి. 

నెల.. మూడు నెలలు.. ఇలా రీఛార్జీ చేయించుకుని ఎంతో మందితో మాట్లాడడం.. డేటా యూజ్ చేయడం వంటివి చేస్తుండే వారు ఎన్ని కాల్స్ చేసుకున్నా ఫ్రీ. కానీ అప్పటిది ఒక లెక్క.. ఇప్పుడో ఓ లెక్క అంటున్నాయి నెట్ వర్క్‌లు. కానీ ఇంత సడన్‌గా కాల్, డేటా ఛార్జీలు వసూలు ఎందుకు చేయాలని అనుకుంటున్నాయి అనే డౌట్ రావచ్చు. దీనికి ఒక రీజన్ ఉంది. జియో వచ్చినప్పటి నుంచి ప్రతి నెటవర్క్ కంపెనీ.. ఫ్రీ కాల్స్, తక్కువ ధరకే డేటా ఇవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీనివల్ల చాలా నెట్‌వర్క్‌ కంపెనీల ఆదాయాలు తగ్గిపోయాయి.

అంతేకాదు..కాల్‌ ఛార్జీల వల్ల కోట్ల రూపాయలు సంపాదించిన కంపెనీలు.. జియో రాకతో ఆ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయాయి. అందరూ డేటాకు మాత్రమే ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు ఏకంగా 74వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో సమన్యాయం చేసేందుకు ఫ్లోర్ ప్రైస్‌ పెట్టాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారు. త్వరలోనే టెలికాం శాఖ కూడా విధివిధానాలు రూపొందించబోతోంది. అందరూ ఓకే అంటే.. త్వరలోనే కాల్‌ ఛార్జీలు కూడా అమల్లోకి వస్తాయి.
Read More : వాట్సాప్‌కు పోటీగా : గూగుల్ సొంత మెసేజస్ RCS యాప్ ఇదిగో