కరోనా : ATMల్లో డబ్బులు ఇలా డ్రా చేయొచ్చా?

  • Published By: bheemraj ,Published On : June 5, 2020 / 09:25 PM IST
కరోనా : ATMల్లో డబ్బులు ఇలా డ్రా చేయొచ్చా?

కరోనా వైరస్ నేపథ్యంలో ఏది తాకాలన్నా భయమేస్తోంది. డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్లాలన్నా చాలా మంది తటపటాయిస్తున్నారు. ఎందుకంటే ఏటీఎంలోకి వెళ్లడం దగ్గరి నుంచి నగదు డ్రా చేసి బయటకు వచ్చే వరకూ మన చేతులు ఏదో ఒక దాన్ని తాకుతూనే ఉండాలి. దీంతో కొందరు శానిటైజర్ ను వెంట తీసుకుని వెళ్లి, డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇందులో భాగంగా కాంటాక్ట్ లెస్ సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రొటోటైప్ ను ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తయారు చేసింది. బ్యాంకుకు చెందిన మొబైల్ యాప్ ను ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా మనకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. 

సాధారణంగా ఏటీఎంకు వెళ్తే డెబిట్/క్రెడిట్ కార్డును మెషీన్ లో ఉంచి, పిన్ ఎంటర్ చేసి, నగదు ఉపసంహరణకు సంబంధించిన ఆప్షన్స్ ను ఎంచుకుంటాం. కానీ కొత్త పద్ధతిలో ఏటీఎంకు వెళ్లిన తర్వాత మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా అక్కడి తెరపై కనిపించే క్యూర్ కోడ్ ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ లోనే ఏటీఎం పిన్ కావాల్సిన మొత్తాన్ని నమోదు చేయడం ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. 

ఏజీఎస్ ట్రాన్సాక్ట్ దాదాపు 70వేలకు పైగా ఏటీఎంలను నిర్వహిస్తోంది. ప్రాథమిక దశలో కాంటాక్ట్ లెస్ ఏటీఎం సౌకర్యాన్ని తీసుకొచ్చేందుకు రెండు బ్యాంకులు అంగీకరించాయట. మరో నాలుగు బ్యాంకులతో ఈ విషయమై చర్చిస్తున్నారు. కొత్త పద్ధతికి  అనుగుణంగా సాఫ్ట్ వేర్ లో మార్పులు, అమలు ప్రక్రియకు ఎనిమిది వారాలకు పైగా పడుతుందని ఏజీఎస్ చెబుతోంది. 

క్యూర్ కోడ్ ద్వారా నగదు విత్ డ్రా చేసుకోవడం మరింత సురక్షితమని ఏజీఎస్ ట్రాన్సాక్ట్ సీటీవో మహేశ్ పటేల్ ఓ ఆంగ్ల పత్రికతో చెప్పారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ను మొబైల్ బ్యాంకింగ్ యాప్ లోనే పొందుపరచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు తమ యాప్ ను కార్డ్ లెస్ విత్ డ్రాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాయి.

Read: బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ సాధ్యం కాదు : ఆర్ బీఐ