వీడియో కాన్ఫిరెన్స్‌లో మంత్రి నిర్మల మీడియా కాన్ఫిరెన్స్ : కరోనా సంక్షోభంపై ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం రెడీ!

  • Published By: sreehari ,Published On : March 24, 2020 / 10:30 AM IST
వీడియో కాన్ఫిరెన్స్‌లో మంత్రి నిర్మల మీడియా కాన్ఫిరెన్స్ : కరోనా సంక్షోభంపై ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం రెడీ!

కరోనా సంక్షోభంతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా దెబ్బకు విలవిలాడిపోతున్న ట్రేడర్లు, కంపెనీలతో పాటు ఆర్థికపరమైన చెల్లింపుల గడువుతేదీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీడియా కాన్ఫిరెన్స్ ఏర్పాటు చేశారు.

కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉండటంతో నేరుగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతి సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోందని నిర్మల అన్నారు.

భారతదేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 492కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి 14,500కు పైగా మరణించారు. ఈ పరిస్థితుల్లో దేశంలో లాక్ డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువుల నుంచి అన్ని రకాలుగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

సామాజిక దూరాన్ని పాటించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. దేశంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది. అందుకే ముందుగా ఆర్థిక ప్యాకేజీనే ప్రాధ్యానత్యగా కేంద్రం పనిచేస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి 8 గంటలకు మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది.

See Also | అన్ని ఏటీఎంల్లో ఉచితంగా విత్ డ్రా.. మినిమం బ్యాలెన్స్ ఫీజు ఎత్తేసిన కేంద్రం