కరోనా దెబ్బతో.. ముంబైలో చిరు వ్యాపారులు గగ్గోలు!

  • Published By: sreehari ,Published On : February 20, 2020 / 03:44 PM IST
కరోనా దెబ్బతో.. ముంబైలో చిరు వ్యాపారులు గగ్గోలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం భారత్ వాణిజ్యరంగంపై పడింది. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చిన్నతరహా వ్యాపారులు ఉత్పత్తుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు నిలిచిపోవడంతో వ్యాపారం నిలిచిపోయింది. చైనా ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారులు కుదేలయ్యారు.

చైనా ఉత్పతులు నిలిచిపోవడంతో తమ భవిష్యత్ ఏంటి అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలినప్పటి నుంచి బిజినెస్ లేక లబోదిబోమంటున్నారు. జుజార్ బాగాస్రావాలా (56) షాపు యజమాని గత పదిహేను సంవత్సరాలుగా మొబైల్ కవర్స్, యాక్ససరీలను విక్రయిస్తున్నాడు. కానీ, కరోనా దెబ్బతో అతడి వ్యాపారం దివాలా తీసింది.

చైనాలోని గ్వంగ్స్యూ ప్రావిన్స్ నుంచి జాజర్ కు ఉత్పత్తులు దిగుమతి అవుతుంటాయి. కొన్నివారాల నుంచి తయారీదారు యూనిట్స్ మూతపడ్డాయి. వుహాన్ సిటీకి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంది. అన్ని తయారీసంస్థ యూనిట్లు మూతపడగా, కొత్త ఆర్డర్లు కూడా నిలిపివేశారు. మరో 2 నుంచి 3 నెలలవరకు ఎలాంటి ఉత్పత్తులు చైనా నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని జుజార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో చిరు వ్యాపారి రాజు పర్మార్ మాట్లాడుతూ.. కొన్ని నెలల నుంచి అనిశ్చితి నెలకొనడంతో ఉత్పత్తుల ధర అమాంతం పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో వస్తువులను అమ్మలేకపోతున్నాం. ఒక హెడ్ ఫోన్ ఖరీదు రూ.400 కాగా.. ఇప్పుడు దీని ధర రూ.420లకు విక్రయిస్తున్నట్టు తెలిపాడు. చైనా నుంచి ఉత్పత్తులు రానిపక్షంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగడంతో కస్టమర్లను కోల్పోతున్నాం.. ఏం చేయలని పరిస్థితుల్లో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.