15విమానాలు కూడా నడపలేకపోతున్న జెట్

  • Published By: venkaiahnaidu ,Published On : April 3, 2019 / 09:33 AM IST
15విమానాలు కూడా నడపలేకపోతున్న జెట్

1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోంది.అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.దీంతో అనేక విమానాలను నిలిపివేసింది.ఇటీవల జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ సంస్థ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు.ఆయన భార్య అనితా గోయల్ కూడా ఎయిర్ లైన్ బోర్డు నుంచి తప్పుకున్నారు. రుణ సంక్షోభంలో చిక్కుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కు యాజమాన్యం మారినా సంస్థ పరిస్థితి మాత్రం ఇంకా మెరుగుపడట్లేదు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్థుత పరిస్థితిపై పౌర విమానయాన శాఖ సెక్రటరీ పీఎస్‌ ఖరోలా బుధవారం(ఏప్రిల్-3,2019) మీడియాతో మాట్లాడారు.జెట్‌ దగ్గర ప్రస్తుతం ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయని ప్రశ్నించగా…నిన్నటి వరకు 28 విమానాలను జెట్‌ నడిపింది. మంగళవారం సాయంత్రం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం.. మరో 15 విమానాలను నిలిపివేసింది. అంటే ప్రస్తుత విమానాల సంఖ్య 15 కంటే తక్కువే ఉండొచ్చు’ అని ఖరోలా తెలిపింది.

ప్రస్థుత పరిస్థితుల్లో  అంతర్జాతీయ విమనాలు నడిపే అర్హత జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.జెట్ ను ఆదుకునేందుకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను ఎస్ బీఐకి అప్పగించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకులు, రుణదాతల కన్సార్టియం జెట్‌ యాజమాన్య బాధ్యతలు తీసుకుంది.

జెట్ ఎయిర్ వేస్ లో ఏర్పడిన పరిణామాల కారణంగా బుధవారం ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి.క్రితం సెషన్‌తో పోలిస్తే 4శాతానికి పైగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.