Big deal : రిలయన్స్ Jio లో FaceBook భారీ పెట్టుబడులు

  • Published By: madhu ,Published On : April 22, 2020 / 03:07 AM IST
Big deal : రిలయన్స్ Jio లో FaceBook భారీ పెట్టుబడులు

వ్యాపార రంగంలో ఎవరు ఎవరితో జత కడుతారో..ఎప్పుడు విడిపోతారో ఎవరికీ తెలియదు. లాభాల కోసం కొత్త కొత్త వ్యూహాలు రచిస్తుంటారు. ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇస్తుంటారు. తాజాగా దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకపోతున్న దిగ్గజ కంపెనీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ భాగమైన Jio ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ లో Facebook పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వ్యాపార రంగంలో సంచలనం సృష్టిస్తోంది.

దేశీయ టెలికం రంగంలో అగ్రగామి సంస్థగా అవతరించిన రిలయన్స్‌ జియోతో… సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్ జతకట్టింది. జియోలో 9.99శాతం వాటా కొనుగోలు చేసింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 43 వేల 574 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసింది. దీంతో 4 లక్షల 62 వేల కోట్ల విలువ ఉన్న జియోలో వాటా కొనుగోలుతో జియోలో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఫేస్‌బుక్ నిలవనుంది. 

జియోలోకి ఫేస్‌‌బుక్‌ను ఆహ్వానిస్తున్నామన్నారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.  ఇది గౌరవప్రదమైనదని.. ప్రతి భారతీయుడు డిజిటల్ రంగంలో మరింత లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాని చెప్పారు. కరోనా తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని… దానికి జియో, ఫేస్‌బుక్ బంధం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2016లో తాము జియోను ఆవిష్కరించిన సంగతిని గుర్తు చేశారాయన. డిజిటల్ సేవలను విస్తరిస్తే..ప్రజా జీవనం మెరుగుపడుతుందని తాము ఆశించడం జరిగిందన్నారు. 

డిజిటల్ ఎకనామీ అభివృద్ధికి తమ బంధం దోహదం చేస్తుందని… ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు, వ్యాపారం కోసం జియో, ఫేస్‌బుక్ కలిసి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయన్నారు. కీలక ప్రాజెక్టుల్లో ఈ సంస్థలు కలిసి పనిచేస్తాయని ప్రకటించారు.