చివరి నిమిషంలో 18 విమానాలు రద్దు 

  • Published By: chvmurthy ,Published On : December 23, 2019 / 09:58 AM IST
చివరి నిమిషంలో 18 విమానాలు రద్దు 

దేశీయ విమాన యాన సంస్ధ గో ఎయిర్ సోమవారం 18విమాన సర్వీసులను ర్దదు చేసింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడం, కాక్‌పిట్‌ సిబ్బంది కొరతతో వీటిని రద్దు చేసినట్లు సంస్ధ తెలిపింది. గోఎయిర్‌కు చెందిన ఏ320 నియో విమానాల్లో ఇంజన్‌ సమస్య తలెత్తటంతో ఆ విమానాలు కొన్ని అందుబాటులో లేవని ఎయిర్‌లైన్‌ వర్గాలు తెలిపాయి. ఈ సమస్యలతో పాటు కాక్‌పిట్‌ సిబ్బంది కొరతతో ముంబై, గోవా, బెంగళూర్‌, ఢిల్లీ, శ్రీనగర్‌, జమ్ము, పట్నా, ఇండోర్‌, కోల్‌కతా నుంచి బయలుదేరాల్సిన 18 విమానాలను సోమవారం  చివరి  నిమిషంలో
గోఎయిర్‌ రద్దు చేసింది.
 

కాగా పౌరసత్వ సవరణ చట్టంపై  దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలతో పాటు.. నిర్వహణ సిబ్బంది అందుబాటులో  లేకపోవటం వల్ల కూడా తమ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని గోఎయిర్‌ ఓ ప్రకటనలో వివరించింది. ప్రతికూల వాతావరణంలో విజిబిలిటీ వంటి సమస్యలతో పాటు పౌర చట్టంపై దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు, విమాన సిబ్బంది హాజరులో పరిమితుల కారణంగా గోయిర్‌ నెట్‌వర్క్‌లోని పలు విమానాల సేవల్లో విఘాతం కలుగుతోందని సంస్థ ప్రతినిధి తెలిపారు..

చివరినిమిషంలో గోఎయిర్‌ విమానాలను రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి గానూ ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాట్లు చేస్తున్నామని… అంతేగాక.. ప్రయాణికులకు ఉచిత విమాన టికెట్ల రద్దు, రీబుకింగ్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు గోఎయిర్ ప్రకటించింది.