మహిళలకు పండుగ : తగ్గిన బంగారం ధరలు

  • Published By: chvmurthy ,Published On : February 25, 2020 / 02:45 PM IST
మహిళలకు పండుగ : తగ్గిన బంగారం ధరలు

గత అయిదు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరకు  మంగళవారం బ్రేక్‌ పడింది. సోమవారం ఒక్కరోజే  ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి రూ.45 వేలకు చేరిన బంగారం ధర నేడు అదే స్థాయిలో పడిపోయింది.    గ్లోబల్‌ మార్కెట్లలో గోల్డ్‌ ధరలు పడిపోవడంతో పాటు మదుపుదారులు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో ఒక్కరోజే ఏకంగా రూ. 1200 దిగివచ్చి రూ 42,855 పలికాయి. 

ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 2.7 శాతం పతనమైంది. అంటే గ్రాముకు రూ.1200 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం రూ.42,371కి క్షీణించింది. ఐదు రోజుల తర్వాత బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి. గత ఐదు రోజుల్లో ఏకంగా రూ.3 వేల పెరిగిన పసిడి ధర గత సెషన్‌లో ఆల్‌టైమ్ హై రూ.43,788ని తాకింది.

పైపైకి ఎగిసిన పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గడంతో మరో వైపు  వెండి ధరలు సైతం దిగి వచ్చాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ. 1495 తగ్గి రూ. 47,910కి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కూడా హాట్‌ మెటల్స్‌ ధరలు దిగివచ్చేందుకు కారణమని బులియన్‌ నిపుణులు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం రానున్న రోజుల్లో బంగారం ధరలను నిర్ధేశిస్తుందని వారు చెబుతున్నారు.