రూ.50 వేలకు చేరువలో బంగారం ? 

  • Published By: murthy ,Published On : May 18, 2020 / 01:07 PM IST
రూ.50 వేలకు చేరువలో బంగారం ? 

అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం… మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ 19  పాజిటివ్ కేసులు  పెరగటంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చైనాపై అగ్రరాజ్యాధినేత  డోనాల్డ్ ట్రంప్ విమర్శలతో చెలరేగటం..వాటికి ధీటుగా బీజింగ్ సమాధానం ఇస్తుండటంతో మదుపరులను బంగారం వైపు ఆకర్షిస్తోంది.

మరో వైపు ఈక్విటీ మార్కెట్లు కుదేలవటంతో బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. సోమవారం ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం రూ.489 పెరిగి ఏకంగా రూ.47,870కి చేరింది. ఇక కిలో వెండి రూ.1859 పెరిగి రూ. 48,577 కి చేరింది. త్వరలోనే ఇవి రెండూ రూ. 50 వేలకు చేరుకుంటాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధర సుమారు 3.40 శాతం, వెండి దాదాపు 8 శాతం పెరిగింది.

గత నెల రోజుల్లో బంగారం ఫ్యూచర్స్ ధరలు దాదాపు రూ.2 వేలు పెరుగుదల చూశాయి. గత నెల 21వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,992 పలికింది. మే నెల 1వ తేదీ నాటికి అది రూ.45,556కు తగ్గింది. 13వ తేదీ వరకు రూ.46 వేల లోపు పలికింది. ఆ తర్వాత నుండి క్రమంగా పెరిగి ఇప్పుడు రూ.47వేలు దాటింది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లో.. ఏడేళ్ల గరిష్టానికి అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర పెరిగింది. స్పాట్ గోల్డ్ 0.9 శాతం పెరిగి ఔన్స్ ధర 1,756.79 పలికింది. అక్టోబర్ 12, 2012 (1,759.98) తర్వాత ఇదే రికార్డ్ ధర. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం లాభపడి 1,765.70 పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్ 0.5 శాతం తగ్గి 1,892.25 డాలర్లు, ప్లాటినమ్ 0.7 శాతం ఎగిసి 803.19 డాలర్లు, వెండి 2 శాతం ఎగిసి 16.96 డాలర్లు పలికింది.