భలే ఉన్నాయ్ : కొత్త గ్యాస్ సిలిండర్లు ఇవే

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 01:36 PM IST
భలే ఉన్నాయ్ : కొత్త గ్యాస్ సిలిండర్లు ఇవే

బాంబుల్లా పేలుతున్న గ్యాస్ సిలిండర్లతో అందరికి భయం పట్టుకుంది. వంటింట్లోకి వెళ్లాలంటేనే మహిళలకు చెమట్లు పడుతున్నాయి. ఎప్పుడు ఏ సిలిండర్ బ్లాస్ట్ అవుతుందో తెలియక వర్రీ అవుతున్నారు. ఇక ముందు అలాంటి భయాలు అక్కర్లేదు. గ్యాస్ బండలు పేలవు. వాటితో ఎలాంటి టెన్షన్స్ ఉండవు. హాయిగా గుండె మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు.

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) వినియోగదారులకు శుభవార్త వినిపించింది. త్వరలో కొత్త రకం గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తేనుంది. ఇవన్నీ పూర్తిగా ఫైబర్‌తో తయారు చేసినవి కావడం ప్రత్యేకత. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెటాలిక్ గ్యాస్ సిలిండర్లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి, బరువు కూడా తక్కువ. ముందుగా 2, 5, 10 కిలోల ఫైబర్ మేడ్ వంట గ్యాస్ సిలిండర్లు తెస్తున్నారు. సరికొత్త డిజైన్లలో రంగు రంగుల్లో ఈ ఫైబర్ కుకింగ్ సిలిండర్లను తయారు చేశారు. ఈ కొత్త సిలిండర్లు కావాలంటే.. పాత సిలిండర్లను వెనక్కి ఇచ్చేయాలి. అంతేకాదు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌పీసీఎల్ అధికారులు చెప్పారు.

మెటల్‌తో చేసిన గ్యాస్ సిలిండర్లతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం ఉంటోంది. దీంతో ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఫైబర్‌తో గ్యాస్ సిలండర్ల తయారీపై చాలాకాలంగా ప్రతిపాదనలు వస్తున్నాయి. దీనిపై కొన్నాళ్లుగా వర్కవుట్ చేసిన అధికారులు చివరకు సక్సెస్ అయ్యారు. ఫైబర్‌తో గ్యాస్ సిలిండర్లను తయారు చేశారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద పుణె, అహ్మదాబాద్‌లో వీటిని వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు. పేలే అవకాశం లేని ఫైబర్‌తో చేసిన వంట గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్ అనే వార్త వినియోగదారుల్లో ఆనందం నింపింది. ఎప్పుడెప్పుడు అవి తమ ఇంటికి చేరుతాయా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫైబర్ సిలిండర్ ప్రత్యేకతలు:
* తుప్పు పట్టవు
* యువీ ప్రొటెక్టెడ్
* నేచర్ ఫ్రెండ్లీ
* ఎంత గ్యాస్ ఉందో చూసుకునే వెసులుబాటు
* మెటాలిక్ సిలిండర్లతో పోలిస్తే బరువు తక్కువ
* పేలే ప్రమాదం ఉండదు