ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్: జూన్ 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్..

  • Published By: vamsi ,Published On : July 28, 2020 / 08:35 AM IST
ఉద్యోగులకు గూగుల్ గుడ్ న్యూస్: జూన్ 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్..

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతులు ఇచ్చేశాయి. లేటెస్ట్‌గా గూగుల్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 జూన్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపారు.



ఆఫీస్ నుంచి వర్క్ చెయ్యాల్సిన అవసరం లేని ఉద్యోగులకు ప్రణాళికను విస్తరించడానికి, 20 జూన్ 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యడానికి అనుమతి ఇస్తున్నట్లు తన మెయిల్‌లో వెల్లడించారు. కొంతమంది ముఖ్య గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లతో సంప్రదించిన తరువాత సుందర్ పిచాయ్ ఈ నిర్ణయం స్వయంగా తీసుకున్నారని ఒక అమెరికన్ మీడియా నివేదించింది.



ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇంతకుముందు జనవరి వరకు మాత్రమే గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఇచ్చింది. గూగుల్ నిర్ణయం తరువాత, టెక్నాలజీ రంగంతో సహా ఇతర పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కాలాన్ని పొడిగించవచ్చని భావిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్న పరిస్థితిలో, కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల జాగ్రత్తలు వహిస్తున్నాయి.

ఈ క్రమంలోనే కరోనా కారణంగా, టెక్ కంపెనీలు క్రమంగా కార్యాలయాలు తెరుస్తామని చెబుతున్నాయి. ఇటీవల, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా నిరవధికంగా పని చేయవచ్చని ప్రకటించింది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, వచ్చే దశాబ్దంలో సోషల్ మీడియా సంస్థల ఉద్యోగుల్లో సగం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.