ఇక PIN అక్కర్లేదు : Google Payలో కొత్త ఫీచర్

  • Published By: sreehari ,Published On : October 29, 2019 / 08:23 AM IST
ఇక PIN అక్కర్లేదు : Google Payలో కొత్త ఫీచర్

గూగుల్ పే వాడే యూజర్లకు గుడ్ న్యూస్. గూగుల్ పే ద్వారా మొబైల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఇకపై PIN ఎంటర్ చేయాల్సిన పనిలేదు. గూగుల్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్ 10తో బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌ను గూగుల్ ప్రకటించింది. ఈ ఫీచర్ డిజిటల్ వ్యాలెట్ ప్లాట్ ఫాం, ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్ పై అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పే లేటెస్ట్ వెర్షన్ 2.100 యాప్ లో ఈ కొత్త ఫీచర్ చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఫీచర్ అప్ డేట్ తో గూగుల్ పే యూజర్లు తమ డివైజ్ లోని ఫింగర్ ఫ్రింట్, ఫేషియల్ రికగ్నైనేషన్ ఫీచర్ ద్వారా ఈజీగా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.

గూగుల్ పే యూజర్లు ఇప్పటివరకూ తమ లావాదేవీల భద్రత కోసం PIN ఎంటర్ చేసేవారు. ఈ లేటెస్ట్ అప్ డేట్ ద్వారా PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలు చేసుకోవచ్చు. యూజర్ల సౌకర్యార్థం గూగుల్.. బయోమెట్రిక్స్ API ఫీచర్ యాప్ లో యాడ్ చేసింది. మీ నగదు లావాదేవీలను ఈ ఫీచర్ ద్వారా మీ ఫింగర్ ఫ్రింట్స్ లేదా ఫేస్ రికగ్నైనైజేషన్ తో ధ్రువీకరించుకోవచ్చు. సాంప్రదాయక PIN సెక్యూరిటీ కంటే వేగవంతంగా కొత్త ఫీచర్ ద్వారా లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ పోలీసు రిపోర్టు ప్రకారం.. ప్రస్తుతం.. ఈ బయోమెట్రిక్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ 10 డివైజ్ ల్లో అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ 9 ఫోన్లలో కూడా అందుబాటులోకి రానుంది. గూగుల్ పే యాప్ లో sending money సెక్షన్ కింద ఈ కొత్త ఫీచర్ ఆప్షన్ కనిపిస్తుంది. 

గూగుల్ పే యూజర్లు PIN సెక్యూరిటీ నుంచి బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కు మార్చుకోవచ్చు. లేదంటే రెండు ఆప్షన్లను అలాగే ఉంచుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే? బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కేవలం నగదు లావాదేవీలకు మాత్రమే వర్క్ అవుతుంది. స్టోర్లలో NFC పేమెంట్స్ జరిపే సమయంలో ఈ ఫీచర్ పనిచేయదు. అందుకోసం మీ ఫోన్ Unlock చేయాల్సి ఉంటుంది. PIN ఆధారిత సెక్యూరిటీ ఫీచర్ కంటే బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పిన్ నెంబర్ గుర్తించుకోవడం అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. 

కొన్నిసార్లు పిన్ నెంబర్ మర్చిపోతే గూగుల్ పే పేమెంట్స్ చేసే పరిస్థితి ఉండదు. అదే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఈజీగా వేగవంతంగా లావాదేవీలు చేసుకోవచ్చునని గూగుల్ ప్రొడక్టు మేనేజర్ స్టీవెన్ సోనెఫ్ తెలిపారు. 2017లో Tez యాప్ పేరుతో గూగుల్ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత  2018లో Tez పేరును మార్చి Google Payగా రీబ్రాండ్ చేసింది. ప్రస్తుతం ఇండియాలో 67 మిలియన్ల (6.7 కోట్లు) మంది గూగుల్ పే యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇటీవలే గూగుల్ తమ యూజర్లకు లావాదేవీలకు సంబంధించి SMS నోటిఫికేషన్లు పంపించడం ప్రారంభించింది.