ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న గూగుల్!

  • Published By: sreehari ,Published On : July 13, 2020 / 04:47 PM IST
ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న గూగుల్!

ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రధాని మోడీతో సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు పిచాయ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి సమయంలో ఎదురయ్యే సవాళ్లతో పాటు కొత్త వర్క కల్చర్ వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించినట్టు ఆయన తెలిపారు.

అనంతరం ‘గూగుల్ ఫర్ ఇండియా’ 6వ వార్షిక ఎడిషన్ వర్చువల్ ఈవెంట్ కార్యక్రమంలో పిచాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటేషన్ ఫండ్‌ను ప్రకటించారు. భారతదేశంలో వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో గూగుల్ కంపెనీ 10 బిలియన్ డాలర్లు (రూ.75వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు పిచాయ్ తెలిపారు. ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాలు, కార్యాచరణ, మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థ పెట్టుబడుల మిశ్రమం ద్వారా చేస్తామని పిచాయ్ పేర్కొన్నారు.


పిచాయ్ తో సమావేశం అనంతరం పీఎం మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు… ‘ఈ ఉదయం, సుందర్‌పిచాయ్‌తో పెట్టుబడుల విషయంలో జరిగిన చర్చ విజయవంతమైంది. పలు విస్తృతమైన విషయాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా భారత రైతులు, యువకులు, పారిశ్రామికవేత్తల జీవితాలను మార్చేలా టెక్నాలజీని అందబాటులోకి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం’ గా మోడీ పేర్కొన్నారు.

కోవిడ్-19 సమయంలో వర్క్ కల్చర్, డేటా భద్రత, సైబర్ భద్రతా, సవాళ్లుకు సంబంధించి చర్చ జరిగినట్టు తెలిపారు. మోడీ ట్వీట్‌కు సమాధానంగా.. పిచాయ్ ట్వీట్ చేశారు.. ‘మీ సమయానికి ధన్యవాదాలు.. PM arenarendramodi – డిజిటల్ ఇండియా పట్ల మీ దృష్టి ఆశాజనకంగా ఉంది. అదే దిశగా మా పనిని కొనసాగాలని భావిస్తున్నాం’ అని ట్వీట్ లో తెలిపారు.