మరో 3వారాలు ఉల్లిపాయల్లేవ్..!

మరో 3వారాలు ఉల్లిపాయల్లేవ్..!

మార్కెట్లో బంగారం కంటే ప్రత్యేక వస్తువుగా మారిపోయింది ఉల్లి. సగటు వినియోగదారుడు ఉల్లిపాయల కోసం చేస్తున్న నిరీక్షన మరో 3వారాల పాటు కొనసాగనున్నట్లు మార్కెటింగ్ వర్గాలు అంటున్నాయి. కొరతను తీర్చే క్రమంలో ఈజిప్ట్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం 6వేల 90 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. అక్కడి వాతావరణం అనుకూలించడంతో ఉల్లిసాగు బాగానే జరిగింది. భారత్‌లో ఉల్లి కొరతకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈజిప్టు ప్రభుత్వం భారత్ కు ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది. 

కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మొత్తంలో తెలంగాణ రాష్ట్రానికి 500 టన్నులు సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వారం రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి వచ్చే అవకాశముండటంతో ఉల్లి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు మార్కెటింగ్‌ శాఖ చెప్పుకొస్తుంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మెహిదీపట్నం రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయించేలా ఏర్పాట్లు చేశారు.

ఆధార్‌ కార్డు చూపించిన వారికి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు విక్రయిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఉల్లిపాయ ఫస్ట్‌ క్వాలిటీ ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చే రెండో క్వాలిటీ ధర రూ.3వేల 700 నుంచి రూ.6వేలకు గరిష్టంగా పెరిగింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల ఉల్లి విత్తనాలు వేయడంలో 3, 4 వారాలు ఆలస్యమవడంతో ఖరీఫ్‌ ఉల్లిపాయ సాగు విస్తీర్ణం తగ్గింది.