భారతీయ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పేముందు, హ్యార్లీ డేవిడ్‌సన్ అదిరిపోయే ఆఫర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : August 21, 2020 / 03:44 PM IST
భారతీయ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పేముందు, హ్యార్లీ డేవిడ్‌సన్ అదిరిపోయే ఆఫర్లు

harley davidson offers: హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ కొనాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడే మంచి సమయం. పేలవమైన అమ్మకాల కారణంగా… భారతదేశంలోని దాదాపు మొత్తం పోర్ట్‌ఫోలియోలో హ్యార్లీ డేవిడ్‌సన్ మంచి బెనిఫిట్స్ ను ఆఫర్ చేస్తోంది. సాఫ్టైల్ మరియు స్పోర్ట్‌స్టర్ శ్రేణి బైక్‌లపై రూ. 2.4 లక్షల వరకు ప్రయోజనాలు మరియు తగ్గింపులను అందిస్తోంది.



స్ట్రీట్ 750 యానివర్సరీ ఎడిషన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ మోటార్‌సైకిల్ ధరను కంపెనీ ఇప్పుడు రూ.72,000 తగ్గించింది. భారతదేశంలో సంస్థ ఎర్పాటు అయ్యి గతేడాదికి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పుడు కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్( స్ట్రీట్ 750 వార్షికోత్సవ ఎడిషన్) ఇప్పుడు రూ. 4.75 లక్షలకు లభిస్తోంది. 2009 ఆగస్టులో హ్యార్లీ డేవిడ్‌సన్ దేశీయ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

హ్యార్లీ డేవిడ్‌సన్ ప్రస్తుతం ….రూ. 90,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను మరియు బిఎస్ 6-కంప్లైంట్ స్పోర్ట్ స్టర్ మరియు సాఫ్టైల్ బైకులతో ₹ 1.5 లక్షల లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తోంది.



మరోవైపు, త్వరలో అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్…భారతీయ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. హ్యార్లీ డేవిడ్‌సన్ కంపెనీ బైకుల అమ్మకాలు గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లేవు. భవిష్యత్‌ కూడా అంత ఆశాజనకంగా కనిపించడం లేదని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో తన అసెంబ్లింగ్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని కంపెనీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అమ్మకాలు బాగున్న దాదాపు 50 మార్కెట్లపై దృష్టి పెట్టాలన్న సంస్థ నిర్ణయం నేపథ్యంలో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతున్నది. కాగా, హర్యానాలోని బవల్‌ ప్లాంట్‌ను ఇతర సంస్థలకు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలన్న యోచనలో హ్యార్లీ డేవిడ్సన్‌ ఉందంటున్నారు.

గత ఆర్థిక సంవత్సరం (2019-20) దేశంలో దాదాపు 2,500 బైకులను హ్యార్లీ అమ్మింది. అలాగే సుమారు 2,100 మోటర్‌సైకిళ్లను బయట దేశాలకు ఎగుమతి చేసింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 106 బైకుల అమ్మకాలకే పరిమితమైంది. ఎగుమతులు 40 శాతం దిగజారి 229 యూనిట్లకు పరిమితమయ్యాయి. భారత్‌ నుంచి ఆసియా, ఐరోపా మార్కెట్లకు ప్రస్తుతం కంపెనీ బైకులను ఎగుమటి చేస్తోంది.