మన ఫోన్లలో చైనా ట్రింగ్ ట్రింగ్ : భారత మొబైల్ మార్కెట్లో డ్రాగన్ ఆధిపత్యం

  • Published By: sreehari ,Published On : November 30, 2019 / 10:31 AM IST
మన ఫోన్లలో చైనా ట్రింగ్ ట్రింగ్ : భారత మొబైల్ మార్కెట్లో డ్రాగన్ ఆధిపత్యం

స్మార్ట్ ఫోన్.. ప్రతిఒక్కరి చేతిలో ఇదో నిత్యావసరంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి ఇది. చిన్నారుల నుంచి పెద్దాళ్ల వరకు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. 2015కు ముందు స్మార్ట్ ఫోన్ ఏంటో పెద్దగా తెలియని వారెందరో. అప్పట్లో ఫీచర్ ఫోన్లదే ట్రెండ్. ఫీచర్ ఫోన్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఖరీదు కూడా ఎక్కువగానే ఉండేది. కొన్నేళ్లు గడిచాక భారత మార్కెట్లలో చైనా స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ మొదలైంది.

అతి చౌకైన ధరకే స్మార్ట్ ఫోన్లు రావడంతో ఎక్కువగా యువత ఆకర్షితులయ్యారు. అప్పటివరకూ ఫీచర్ల ఫోన్లపై తీవ్ర ప్రభావం చూపింది. క్రమంగా ఫీచర్ ఫోన్లపై డిమాండ్ తగ్గిపోతూ వచ్చింది. అప్పటికే స్మార్ట్ ఫోన్లలో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ అందించే స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. భారతీయ స్మార్ట్ ఫోన్లలో మైక్రోమ్యాక్స్ అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. 2014 ఏడాదిలో భారత స్మార్ట్ ఫోన్లకు మంచి గిరాకీ ఉండేది. 

 

ఒక్కప్పటి మైక్రోమ్యాక్స్ ఇప్పుడు వేరు : 
అదే ఏడాదిలో పుంజుకున్న దేశీయ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ అగ్రస్థానంలో ఉన్న శాంసంగ్ మార్కెటును దెబ్బకొట్టింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల కంటే మైక్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ భారీగా నడిచేది. నాలుగేళ్ల క్రితం మైక్రోమ్యాక్స్ కార్యాలయం గుర్గావ్ లో మూడు అంతస్థుల భవనంలో స్థాపించింది. అప్పటల్లో చాలా గదులు ఉండేవి. బాల్కానీలు, టెర్రస్ ఇలా మరెన్నో వసతులు ఉండేవి.

కానీ, ప్రస్తుతం.. మ్యాక్రోమ్యాక్స్ అదే గుర్గావ్ ప్రాంతంలో ఒకే సింగిల్ ఫ్లోర్ తో మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కొన్ని క్యాబిన్లు, కొద్దిమొత్తంలో ఉద్యోగులతో నెట్టుకోస్తోంది. దేశీయ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లలో మైక్రోమ్యాక్స్ తర్వాత లావా, ఇంటెక్స్ కూడా దాదాపు 54శాతం మార్కెట్ షేర్ నడిచేది. ఇప్పుడు అదే బ్రాండ్ల మార్కెట్ షేరు 10శాతానికి పడిపోయింది. ఎందుకు ఇలా జరిగింది. అసలు కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానంగా చైనా స్మార్ట్ ఫోన్ల దిగుమతి అని నొక్కిచెప్పవచ్చు. 

 

షియోమీ మార్కెట్ 29.7శాతం :   
భారత మొబైల్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్లు ప్రవేశించిన కొద్దికాలంలోనే ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. తక్కువ ధరకే చైనా ఫోన్లు అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఆసక్తి చూపించారు. ఫలితంగా దేశీయ తయారీ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ దిగువ స్థాయికి పడిపోయింది.

ప్రతిఒక్కరూ చైనా స్మార్ట్ ఫోన్ల కోసం ఎగబడిపోయారు. దేశంలో ప్రవేశించిన చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో షియోమీ కంపెనీ ఒకటి. భారత మార్కెట్లో షియోమీ సంచలనం సృష్టించింది. గత ఐదేళ్లలో షియోమీ మిలియన్ల కొద్ది స్మార్ట్ ఫోన్లను షిప్పింగ్ చేసింది. IDC డేటా ప్రకారం.. ఇండియాలో షియోమీ స్మార్ట్ ఫోన్ల దిగుమతి 29.7శాతానికి చేరినట్టు రిపోర్టు తెలిపింది.

 

 

ఇండియాలో టాప్ ఐదు చైన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో షియోమీ అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో వరుసగా వివో (3వ స్థానం), ఒప్పో(4వ స్థానం) , ట్రాన్సిషన్ (5వ స్థానం)లో నిలిచాయి. 2014కు ముందు భారత మార్కెట్లో ఉన్న నోకియా మార్కెట్‌ను శాంసంగ్ దెబ్బతీసి 2వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా, ఇంటెక్స్, మైక్రోమ్యాక్స్ రెండూ కంపెనీలు కలిసి కంజ్యూమర్ అపైలెన్స్ విక్రయిస్తున్నాయి. ప్రతిఏడాదికి దాదాపు మిలియన్ల కొద్ది టీవీలను అమ్ముతున్నట్టు మైక్రోమ్యాక్స్ చెబుతోంది.

ఇక ఇంటెక్స్ తమ భారత బ్రాండ్లలో LED TV బ్రాండ్ కూడా ఒకటిగా ఉందని తమ వెబ్ సైటులో ప్రకటించింది. ఇంటెక్స్ నుంచి ఎయిర్ కండీషనర్లు, స్పీకర్లు కూడా మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.  చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో షియోమీతోపాటు మరో చైనీస్ కంపెనీ Gionee కూడా భారత మార్కెట్లో ట్రెండ్ సృష్టించింది.  2013లో భారత టాప్ 10 మార్కెట్లోకి Gionee ఇండియా ఒకటిగా నిలిచిన ఈ కంపెనీ.. F103 modelతో భారతీయ స్మార్ట్ ఫోన్ తో అడుగుపెట్టింది. 

 

చైనా ఫోన్లకు ఎందుకింత గిరాకీ :
చైనీస్ స్మార్ట్ ఫోన్లపై ఎప్పుడూ తక్కువ ధరకే కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. భవిష్యత్తులోనూ తక్కువ ధరకే ఆఫర్ చేయడాన్ని కొనసాగించనున్నాయి. చైనా ఫోన్ల రాకతో భారత మొబైల్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. తక్కువ ధరకే చైనా ఫోన్లు వస్తుండటంతో ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ల మార్కెట్ కు తీవ్ర పోటీ నెలకొంది. ఇక ఆఫ్ లైన్ సిగ్మెంట్లలో ఒప్పో, వివో స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

తమ బ్రాండ్లు మార్కెట్లో సేల్ అయ్యేందుకు రిటైలర్లు, పంపిణీదారులకు అధిక మొత్తంలో చెల్లిస్తున్నాయి. ఇప్పటివరకూ సాధారణ ప్రొడక్టుల ధరల్లో మార్పులు లేకపోవడానికి కారణం ఇదేనని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు.. ఒప్పో, వివో బ్రాండ్లు ఐపీఎల్ అడ్వర్టైజ్ మెంట్స్, స్పాన్సర్ షిప్ ఇస్తున్నాయి. భారత క్రికెట్ జట్టుకు భారీ మొత్తంలో చెల్లిస్తున్నాయి. రిటైలర్లకు కూడా అదే స్థాయిలో చెల్లించేందుకు ఎంతమాత్రం వెనుకాడట లేదు. 

షియోమీ, వివో, ఒప్పో తమ పంపిణీదారులకు వ్యాల్యూమ్ ఆధారంగా టార్గెట్లు ఇస్తున్నాయి. కానీ, శాంసంగ్ మాత్రం విలువపై ఆధారంగా టార్గెట్స్ ఇస్తోందని గుర్గావ్ ఆధారిత పంపిణీదారుడు ఒకరు తెలిపారు. చైనీస్ డివైజ్ లను కొనుగోలు చేసేలా ప్రదర్శించడం వల్ల రిటైలర్లు ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్లో తక్కువ ఖరీదు ఉన్న స్మార్ట్ ఫోన్లే ఎక్కువ గిరాకీ ఉంటుంది.

అందుకే తమ లక్ష్యాలను సాధించగలుగుతున్నాయి. శాంసంగ్ సహా ఇతర బ్రాండ్లకు కాస్త కష్టంగా మారుతోంది. బీహార్ లోని క్రిష్ణగంజ్ లో స్మార్ట్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్, రిటైల్ ఛానల్ నడిపే ముదిత్ సేథియా మాట్లాడుతూ.. కొన్ని చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఒక యూనిట్ అమ్మకంపై రూ.150వరకు ఇన్సెంటీవ్ గా చెల్లిస్తున్నాయని చెప్పాడు. ఫోన్ ఖరీదు బట్టి చెల్లించే ఇన్సెంటీవ్ ఒక్కో యూనిట్ అమ్మకంపై రూ.200 వరకు ఉంటుందని తెలిపాడు. 

 

భారతీయ బ్రాండ్లు తగ్గడానికి కారణం? :
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై క్రేజ్ తగ్గడానికి ప్రధాన కారణం లేకపోలేదు. మార్కెట్లో భారతీయ స్మార్ట్ ఫోన్లపై యూజర్ల ఆసక్తిని తమవైపు ఆకర్షించడంలో విఫలమైందనే చెప్పాలి. ఇండియాలో 3G నుంచి 4G నెట్ వర్క్ కు ఒక్కసారిగా మారడం భారత బ్రాండ్ల మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. అదే సమయంలో రిలయన్స్ జియో Jiophone2తో మార్కెట్లోకి అడుగుపెట్టి పూర్తిగా గేమ్ మార్చేసింది.

మరోవైపు 2016లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కూడా భారత బ్రాండ్ల మార్కెట్ తగ్గడంలో కీలకంగా మారింది. అదే సమయంలో 4G సర్వీసులపై దృష్టిపెట్టిన సమయంలో 3G స్మార్ట్ ఫోన్లతో భారీ మొత్తంలో స్టాక్ ఉందని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ లిమిటెడ్, సహా వ్యవస్థాపకుడు వికాస్ జైన్ తెలిపారు. ఆ తర్వాత టోటల్ అడ్రసబుల్ మార్కెట్ (TAM) దిగువకు పడిపోయిందని అన్నారు. చైనాలో 3G ఫోన్లపై భారతీయ బ్రాండ్లకు ఎన్నో కమిట్ మెంట్స్ ఉన్నాయని జైన్ చెప్పారు.

 

4G డివైజ్‌ల డిమాండ్ పెరగడంతో :
షియోమీ సహా ఇతర బ్రాండ్లు తమ 4G సర్వీసులను అమ్ముతున్నాయి. 60 నుంచి 75 రోజులు కాస్తా 365 రోజులకు పొడిగించడంతో దేశీయ బ్రాండ్లపై ప్రభావం చూపిందని జైన్ తెలిపారు. వినియోగదారుల 4G ఎనేబుల్డ్ డివైజ్ డిమాండ్లను మార్కెట్ లీడర్లు పూర్తిస్థాయిలో నేరవేర్చలేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అంతకుముందే చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు భారత మార్కెట్లలో తమ 4G డివైజ్ లతో ఆధితపత్యం దిశగా దూసుకెళ్తున్నాయి. మరోవైపు రిలయన్స్ జియో కూడా దేశీయ టెలికం ఆపరేటర్లను 4G కనెక్టవిటీ, వాయిస్ ఓవర్ LTE (VoLTE) కాలింగ్ మారేలా చేసింది.

చైనా స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరగడానికి కేవలం ధర అనేది మంత్ర కాదని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అభిప్రాయపడ్డారు. చైనీస్ బ్రాండ్లకు తమ సెల్ ఫోన్లను నష్టానికి అమ్ముతున్నామని తెలిసినా కూడా వినియోగదారులను ఆకర్షించడమే పరమావధిగా భావిస్తాయని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లోనైనా భారతీయ స్మార్ట్ ఫోన్లు పుంజుకుని సొంత మార్కెట్లలో చైనా బ్రాండ్లకు ధీటుగా ఏ మేరకు తట్టుకుని నిలబడగలవో చూడాలి.