Mukesh Ambani: అమెరికా, చైనాలతో సమానంగా భారత్‌.. నిజమైన సంపద అదే -ముఖేష్ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే 30 సంవత్సరాల్లో వచ్చే ఆర్థిక సంస్కరణలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇండియాలో సంపద సృష్టి పేదవారి నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047కల్లా అమెరికా, చైనాలతో సమానంగా భారత్ ధనిక దేశంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు.

Mukesh Ambani: అమెరికా, చైనాలతో సమానంగా భారత్‌.. నిజమైన సంపద అదే -ముఖేష్ అంబానీ

Mukesh Ambani

Reliance Industries: రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రాబోయే 30 సంవత్సరాల్లో వచ్చే ఆర్థిక సంస్కరణలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇండియాలో సంపద సృష్టి పేదవారి నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047కల్లా అమెరికా, చైనాలతో సమానంగా భారత్ ధనిక దేశంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన ఒక వ్యాసంలో ఈమేరకు అభిప్రాయాలను పంచుకున్నారు ముఖేష్ అంబానీ.

“సరొకొత్త భారత్, ఆర్థికంగా ఎదుగుదల గురించి నేను ఎంతో ఆశాజనకంగా.. నమ్మకంగా ఉన్నాను. భారత్ గతంలో కంటే పుంజుకుంది” అని అన్నారు. 1991లో కొరతలతో సతమతమైన భారత ఆర్థిక వ్యవస్థ.. 2021కల్లా మిగులు ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, జీడీపీ 266 బిలియన్‌ డాలర్ల నుంచి 10 రెట్లు పెరిగింది అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దిశను 1991 మార్చిందని, లైసెన్స్‌ కోటా రాజ్‌కు ముగింపు పలికిందని, వ్యాపార, పారిశ్రామిక విధానాల్ని సరళతరం చేసిందని వ్యాసంలో రాసుకొచ్చారు. ఈ సంస్కరణలు భారత్‌ను ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించేలా చేసిందని తన వ్యాసంలో వెల్లడించారు. ఈ మార్పు, వేగం, స్థాయి, అపూర్వమైనవి, అనూహ్యమైనవి అని అంబానీ చెప్పారు.

మన దేశం ముందుకు సాగే పాజిటివిటీని ప్రజల్లో తీసుకుని రావాలని ప్రయోజనాలు, అభిరుచులను వేగవంతం చేయాలని, మహమ్మారి వంటి ఊహించని, తాత్కాలిక సమస్యలతో పోరాడుతూనే రాబోయే ముప్పై ఏళ్ళను స్వతంత్ర భారత చరిత్రలో అత్యుత్తమంగా మార్చడానికి మనకు అవకాశం ఉందని, మన పిల్లలు, యువత పట్ల కూడా ఇందుకు సంబంధించిన బాధ్యత ఉంది”అని అంబానీ అన్నారు.

దేశంలో జనాభా 88కోట్ల నుంచి 138 కోట్లకు పెరిగినప్పటికీ, పేదరికం శాతం సగానికి తగ్గిందని చెప్పుకొచ్చారు. 2047లో నూరు వసంతాల స్వాతంత్య్ర దినోత్సవానికల్లా మూడు పెద్ద ధనిక దేశాల్లో ఇండియా ఒకటిగా సంబరాలు చేసుకోవడం పెద్ద కల అని ముఖేష్ అంబానీ అన్నారు. సంపద సృష్టి , ప్రత్యేకమైన భారతీయ , ఆత్మనిర్భర్ నమూనాను అనుసరించడంతో పాటు ప్రపంచంలోని అన్ని సరైన పాఠాలను నేర్చుకోవడం ద్వారా దీనిని సాధించగలమని అన్నారు.

అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, ఆందరికీ ఉపాధి, అందరికీ ఇళ్లు, అందరికీ పర్యావరణ రక్షణ.. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అందరికీ సంతోషం’ అనేదే నిజమైన సంపద అని ముఖేష్ అంబానీ అందులో ప్రస్తావించారు.