G-20దేశాల్లో భారత్ దే ఎక్కువ వృద్ధి…ఆ సంస్థలకు 50వేల కోట్లు ప్రకటించిన ఆర్బీఐ

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2020 / 06:01 AM IST
G-20దేశాల్లో భారత్ దే ఎక్కువ వృద్ధి…ఆ సంస్థలకు 50వేల కోట్లు ప్రకటించిన ఆర్బీఐ

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశం పదునైన మార్పును సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. IMF ప్రొజెక్షన్స్ ను పేర్కొంటూ శుక్రవారం(ఏప్రిల్-17,2020)ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత రెండోసారిగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. 2021-22ఆర్థికసంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.4శాతంగా ఉండనుందని అంచనావేసినట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. 2020లో భారత జీడీపీ వృద్ధి 1.9శాతంగా ఉంటుందని IMF అంచనావేసింది. G-20దేశాల్లో ఇదే అత్యధికమవుతుందని కూడా తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాల ఆర్థికవ్యవస్థలు తీవ్రమైన ఇబ్బందుల్లోకి జారుకుంటున్నవేళ ఇది పెద్ద విలువైనదనే అని చెప్పవచ్చు.

మరోవైపు ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి తాజా చర్యలను శక్తికాంత్ దాస్ ప్రకటించారు. అంతేకాదు ప్రతీ అంశాన్ని, పరిణామాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని,  సంబంధిత చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా  అధిగమించేందుకు ఆర్‌బీఐ  అండగా వుంటుందని ఆయన  భరోసా ఇచ్చారు.  కరోనా వైరస్ పరిస్థితిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామనీ  ఆర్థిక వ్యవస్థను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు.

ఈ సందర్భంగా  24 గంటలూ  శ్రమిస్తూ విశేష సేవలందించిన  ఆర్‌బీఐ ఉద్యోగులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  బ్యాంకుల సేవలు కూడా ప్రశంసనీయమని తెలిపారు.  దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఏటీఎంలు  సమర్ధవంతంగా పని చేస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 1930 తరువాత ఇంతటి సంక్షభాన్ని చూడలేదనీ, అయినా ఎటువంటి  పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు.

నాబార్డు , సిడ్బీ, ఎన్‌హెచ్‌బి వంటి ఆర్థిక సంస్థలకు రూ. 50 వేలకోట్ల ప్రత్యేక రీఫైనాన్స్ సౌకర్యాలను గవర్నర్ ప్రకటించారు. రివర్స్ రెపో రేటు  4 శాతం నుంచి  పావుశాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం 3.75 శాతంగా వుంటుంది. వాణిజ్య బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ను ప్రస్తుతమున్న 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించనున్నట్లు  గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఇది రెండు దశల్లో పునరుద్ధరించ బడుతుందన్నారు. 2020 అక్టోబర్ 1 నాటికి 90 శాతం, ఏప్రిల్ 1, 2021 నాటికి 100 శాతంగా ఉంటుందని తెలిపారు.

కాగా కరోనా సంక్షోభం కారణంగా  గత నెలలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ముందస్తు సమీక్షను చేపట్టిన  ఆర్‌బీఐ కీలక వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతం నుంచి 4.40 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ రోజు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశముంది.