సిద్దిపేటలో ఆధునిక మార్కెట్ ప్రారంభం: రూ. 20 కోట్లతో నిర్మాణం

  • Published By: chvmurthy ,Published On : February 6, 2019 / 10:23 AM IST
సిద్దిపేటలో ఆధునిక మార్కెట్ ప్రారంభం: రూ. 20 కోట్లతో నిర్మాణం

సిద్దిపేట : సిద్దిపేటలో రూ. 20 కోట్ల వ్యయంతో 6.10 ఎకరాల విస్తీర్ణంలో  నిర్మించిన సమీకృత మార్కెట్‌ను మాజీ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. వినియోగదారుడికి అన్ని సరుకులు ఒకే చోట లభించేందుకు వీలుగా సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను సిద్దిపేట, కరీంనగర్ రోడ్డులోని పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్మించారు. తెలంగాణలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇది. ఈ మార్కెట్ ప్రారంభంతో కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, చేపలు, నిత్యావసర సరుకులన్నీ ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్‌లో సమీకృత మార్కెట్ల నిర్మాణాలు చేపట్టారు. 

సిద్దిపేట సమీకృత వెజ్ అండ్ నాన్ మార్కెట్‌లో మొత్తం 4 విభాగాలు ఉన్నాయి. 1. కూరగాయల రిటైల్, హోల్‌సేల్ ప్రాంగణం, 2. నాన్ మార్కెట్, 3. చేపల విక్రయాలు, 4. కూరగాయలను విక్రయించే విధంగా నాలుగు విభాగాలను నిర్మించారు. మార్కెట్‌లో 17 వాణిజ్య దుకాణాలతోపాటు 21 హోల్‌సేల్ దుకాణాలను ఏర్పాటు చేశారు. చేపల విక్రయాలకు 17 స్టాల్స్, రిటైల్ కూరగాయల వ్యాపారుల కోసం 10 స్టాల్స్‌ను నిర్మించారు. వీటితోపాటు 92 స్టాల్స్‌తో నాన్ వెజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. నాన్ వెజ్ మార్కెట్‌లో ప్రతి స్టాల్ కు మంచినీటి కనెక్షన్‌తోపాటు లాకర్ సదుపాయం ఏర్పాటు చేశారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా డిజిటల్ ధరల పట్టికలను ఏర్పాటు చేశారు. వీమార్ట్ సూపర్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. వాణిజ్య దుకాణ సముదాయాలకు బహిరంగ వేలం వేసి వ్యాపారులకు అప్పగించారు.

మార్కెట్‌కు వచ్చే వినియోగదారులకు సౌలభ్యంగా ఉండటంకోసం రెండు చోట్ల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. మార్కెట్ ప్రాంగణం ముందు భాగాన్ని కార్పొరేట్ కార్యాలయాల తరహాలో ఆధునీకంగా నిర్మించారు. మార్కెట్‌లో 2 మంచినీటి ప్లాంట్లను నిర్మించారు. పచ్చదనం ఉండేలా మొక్కలను సైతం నాటి గ్రీనరి ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే కార్పొరేట్ తరహాలో సిద్దిపేటలో నిర్మించిన మొదటి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్  మార్కెట్.  త్వరలో మార్కెట్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.