ఐఆర్‌సీటీసీ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

  • Published By: vamsi ,Published On : October 4, 2019 / 04:54 AM IST
ఐఆర్‌సీటీసీ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) కు అధ్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. గురువారంతో ముగిసిన చివరి రోజు వరకు ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం.

ఈ ఐపీఓ ద్వారా రూ.645 కోట్లు సమీకరించనున్నారు. ఇందుకు సంబంధించి 2 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచగా.. 225 కోట్ల షేర్లకు బిడ్స్‌ వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్ల (క్యూఐబీ)కు సంబంధించిన కేటగిరీ 108.79 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.

మందగమనంలో ఉన్నా కూడా భవిష్యత్తు అంచనాలు ఆశావహంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన లభించిందని నిపుణులు అంటున్నారు. ఈ ఐపీఓలో భాగంగా 12.6 శాతానికి సమానమైన 2 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌  సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించింది.

ఐపీఓలో భాగంగా షేరు ధరలని రూ. 317 నుంచి రూ. 320గా నిర్ణయించగా  ఈ ఐపీఓ ద్వారా కేంద్రానికి రూ.645 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నెల 14న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి.   రూ.150–200 రేంజ్‌లో లిస్టింగ్‌ లాభాలు ఉండొచ్చని నిపుణుల అంచనా.

ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాబోతున్న రెండో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యంత విజయవంతమైన ఐపీఓ ఇదే. క్విబ్, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల, ఉద్యోగుల వాటాల విషయంలో అత్యధిక బిడ్‌లు వచ్చాయి.

రైల్వేలకు కేటరింగ్‌ సర్వీసులు అందించే ఏకైక కంపెనీ ఐఆర్‌సీటీసీయే. ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లు, ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను ఈ కంపెనీ అమ్ముతుంది.