బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ సాధ్యం కాదు : ఆర్ బీఐ

  • Published By: bheemraj ,Published On : June 4, 2020 / 09:23 PM IST
బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ సాధ్యం కాదు : ఆర్ బీఐ

బ్యాంకు రుణాలపై మారటోరియం కాలంలో విధించే వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సుప్రీంకోర్టుకు తెలిపింది. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతిస్తే ఆర్థిక సంస్థలు రూ.2 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం ఉందని ఆర్ బీఐ అంచనా. వడ్డీ మాఫీ చేస్తే మాత్రం అది ఆర్థిక సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు ఆ సంస్థల స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది.

మారటోరియం కాలంలో లోన్లపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను తిరస్కరించాలని ఆర్ బీఐ.. సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయంలో సదరు పిటిషనర్ మారటోరియాన్ని రుణమాఫీగా తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. మారటోరియం అంటే రుణాల చెల్లింపు వాయిదా మాత్రమే అని, మాఫీ కాదని స్పష్టం చేసింది. బ్యాంకుల్లో ఖాతాదారుల డబ్బుకు భద్రతతోపాటు దేశ ఆర్థిక స్థిరత్వం కూడా ఎంతో ముఖ్యమని కోర్టులో వాదించింది. రుణాలపై మారటోరియం విషయంలో నిర్ణయం ఆయా బ్యాంకుల విచక్షణ మీదే ఆధారపడుతుందని..దీనిలో ఆర్ బీఐ పాత్ర లేదని తెలిపింది. 

కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కలిగించేందుకు రుణాల చెల్లింపుపై తొలుత 3 నెలల మారటోరియం విధించింది. వైరస్ తీవ్రతతో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మరో 3 నెలలు మారటోరియాన్ని పొడిగించింది. ఈ కాలంలో రుణం అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించకపోయినా.. బ్యాంకులు వాటిపై ఎలాంటి అపరాధ రుసుము విధించవు. కానీ మారటోరియం కాలంలో వడ్డీ మాత్రం పెరుగుతూవుంటుంది. 

Read: మాల్స్, సూపర్ మార్కెట్లు వద్దు కిరాణ షాపులే ముద్దు.. కరోనా, లాక్ డౌన్ తెచ్చిన మార్పు