నో రిటైర్మెంట్..! : అలీబాబా చైర్మన్ పదవికి జాక్ మా వీడ్కోలు

  • Edited By: sreehari , September 9, 2019 / 07:10 AM IST
నో రిటైర్మెంట్..! : అలీబాబా చైర్మన్ పదవికి జాక్ మా వీడ్కోలు

కంపెనీలో పనివేళలపై కొత్త ఫార్మూలాలను సృష్టించి ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేసే చైనీస్ ఈ కామర్స్ రిటైల్ కంపెనీ అలీబాబా సహా వ్యవస్థాపకుడు, టెక్ బిలియనర్ జాక్ మా.. చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నారు. సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా వీడ్కోలు పలుకనున్నారు. అదే రోజున జాక్ మా తన 55వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మాజీ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనర్ బిజినెస్ మేన్ గా అవతరించారు. అప్పటినుంచి ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబాలో సహ వ్యవస్థాపకుడిగా ఎన్నో సేవలు అందించారు. తన వంతు కృషి చేసి కంపెనీ అభివృద్ధిలో జాక్ మా కీలక పాత్ర పోషించారు. తన నమ్మదగిన భాగస్వాములైన సీఈఓ డానియల్ జాంగ్, సహా వ్యవస్థాపకుడు, వైస్ చైర్మన్ జోసెఫ్ టిసాయితో కలిసి అలీబాబా కంపెనీ అభివృద్ధిలో భాగమయ్యారు. 

2018 ఏడాదిలోనే జాక్.. తన చైర్మన్ పదవిని సీఈఓ జాంగ్ కు అప్పగించనున్నట్టు ప్రకటించారు. అయితే అలీబాబా బోర్డు చైర్మన్ పదవి కాలం 2020 వరకు ఉంది. డానియల్ జాంగ్.. షియోజాయ్ అనే వ్యక్తిగా కంపెనీ ఉద్యోగులకు బాగా సుపరిచితుడు. తన 11ఏళ్ల పదవీకాలంలో చైనీస్ బిలియనర్ గా జాంగ్ ఎంతో నమ్మకాన్ని సంపాదించుకున్నారు.

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరైన జాక్ మా.. తన కెరీర్ లో అంత తొందరగా అద్భుతాలు సాధించలేదు. స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ జెరీ యాంగ్ సాధించలేని ఎన్నో అద్భుతాలను జాక్ మా సాధించి చూపించారు. 1999లో విదేశీ రిటైలర్లతో కలిసి ఈస్టరన్ సిటీ హ్యాంగ్ జూ లోని అపార్ట్ మెంట్ లో అలీబాబా సంస్థను ఏర్పాటు చేశారు. జాక్ మా 18 మంది సభ్యులతో కలిసి అలీబాబాను స్థాపించారు. 20ఏళ్లలోనే అతిపెద్ద ఈ కామర్స్ ప్లాట్ ఫాంగా అవతరించింది. సెప్టెంబర్ 6 నాటికి అలీబాబాలో 66వేలకు పైగా ఫుల్ టైం ఉద్యోగులతో 420 బిలియన్ డాలర్ల విలువతో మార్కెట్లలో విస్తరించింది. 

రిటైర్మెంట్ వార్తలపై ఖండన :
669.. 996 అనే ఫార్మూలాలతో ఉద్యోగుల పనివేళలు, వారంలో ఎన్ని రోజులు పనిచేయాలి అనేదానిపై కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన జాక్ మా.. రిటైర్మెంట్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. తన 55వ పుట్టినరోజు సందర్భంగా జాక్ మా రిటైర్మెంట్ ప్రకటించినున్నట్టు వచ్చిన వార్తలపై అలీబాబా కంపెనీ ప్రతినిధి ఒకరు తీవ్రంగా ఖండించారు. జాక్ మా.. భవిష్యత్తులో కూడా అలీబాబా కంపెనీ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ గా కొనసాగుతారని అన్నారు. జాక్ మా రిటైర్ కావడం కాలేదని స్పష్టం చేశారు.