గాల్లో జీవితాలు : స్కూలు ఫీజులు కట్టలేక జెట్ ఉద్యోగుల‌ కన్నీరుమున్నీరు

దేశీయ విమానాయన సంస్థ జెట్ ఎయిర్ వేస్ లో తలెత్తిన సంక్షోభంతో 14వేల మంది జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు జీవితాలు ప్రశ్నార్థంగా మారాయి.

  • Published By: sreehari ,Published On : April 17, 2019 / 02:00 PM IST
గాల్లో జీవితాలు : స్కూలు ఫీజులు కట్టలేక జెట్ ఉద్యోగుల‌ కన్నీరుమున్నీరు

దేశీయ విమానాయన సంస్థ జెట్ ఎయిర్ వేస్ లో తలెత్తిన సంక్షోభంతో 14వేల మంది జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు జీవితాలు ప్రశ్నార్థంగా మారాయి.

దేశీయ విమానాయన సంస్థ జెట్ ఎయిర్ వేస్ లో తలెత్తిన సంక్షోభంతో 14వేల మంది జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రోడ్డునపడ్డారు. కొన్నినెలలుగా జీతాల్లేక భార్యాబిడ్డలను పోషించుకోలేక నరకయాతన పడుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్.. విమాన సర్వీసులను నడపలేక.. తమ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేక చేతులేత్తేసింది. ఎయిర్ వేస్ సంస్థకు నిధుల జారీ విషయంలో రుణదాతలు నిరాకరించడంతో సంస్థ ఉద్యోగుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఎయిర్ వేస్ వేతనాల మీద ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు పనిలేక, జీతాలు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారిపోయింది.

ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే పిల్లలకు స్కూల్లో ఫీజులు కడుతున్నారు. కనీసం పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టే పరిస్థితి లేదు. స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? లోన్లకు EMI లు  ఎలా చెల్లించేదెట్టా అని దేవున్ని  మొరపెట్టుకుంటున్నారు. జీతాలు చెల్లించాలంటూ ఎయిర్ వేస్ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఆందోళన చేపట్టిన ఫలితం శూన్యం. వేతనాలు చెల్లించేందుకు తమ దగ్గర నిధులు లేవని, ఆ ప్రయత్నంలోనే ఉన్నామని యజమాన్యం చెబుతూ వస్తోంది. నిధులు జారీ చేస్తానన్న ఎస్ బీఐ నేతృత్వంలోని రుణదాతలు కూడా వెనక్కి తగ్గడంతో ఎయిర్ వేస్ సర్వీసులు రద్దు చేసింది. 

కుమారుడి వైద్యఖర్చులకు డబ్బుల్లేక :
ఆ సంస్థలో పనిచేస్తున్న పైలట్లు సహా ఎయిర్ వేస్ సిబ్బంది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. జెట్ ఎయిర్ వేస్ ఒక్కో ఉద్యోగి పరిస్థితి దుర్భరంగా మారింది. జెట్ ఎయిర్ వేస్ కెప్టెన్ అమిత్ రాయ్ (పేరు మార్చారు) మార్చి 16, 2019 రోజును అతడి జీవితంలో ఎప్పటికి మరువలేనిది. ఆ రోజు ఉదయం కెప్టెన్ అమిత్ రాజ్ కు.. ఎయిర్ క్రాఫ్ట్ మెయింట్ నెన్స్ ఇంజినీర్ (AME)వాట్సాప్ గ్రూపు నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఇంజినీర్ తనకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరుతూ వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. తన కుమారుడికి అప్లాస్టిక్ అనీమియా ట్రీట్ మెంట్ జరుగుతోందని, వైద్యఖర్చుల కోసం డబ్బు అవసరం ఉందని తెలిపాడు.

‘కంపెనీ HRను రిక్వెస్ట్ చేసి పెండింగ్ లో ఉన్న తన మూడు నెలల వేతనాన్నిఇప్పించాల్సిందిగా కోరాడు. ఎముక మజ్జ మార్పిడి చికిత్స కోసం రూ.25 లక్షలు అవసరమని కోరాడు. తనకు మరో దారి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో తన తోటి ఉద్యోగులు కూడా సాయం చేసే పరిస్థితుల్లో లేరని వాపోయాడు’ అని వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు ఆ AME ఇంజినీర్. అది చదివిన కెప్టెన్ అమిత్ కు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. మేనేజ్ మెంట్, పైలట్లతో చర్చించి ఆపరేషన్ కు డబ్బు అరేంజ్ చేసేలోపే ఆ ఇంజినీర్ పిల్లాడు చనిపోయాడు. 
 
మా పిల్లల స్కూల్ ఫీజు కట్టేదెట్టా : 
మరో ఉద్యోగి పరిస్థితి ఇలా.. సుక్బీర్ సింగ్ (45) అనే జెట్ లోడర్ సూపర్ వైజర్ గా ఢిల్లీ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. మూడు నెలల నుంచి జెట్ ఎయిర్ వేస్ నుంచి జీతాలు రాకపోవడంతో అతడి కుటుంబ పరిస్థితి ధీనస్థితికి మారింది. ‘నా కూతురు చదువుకు డబ్బులు లేవు. కోచింగ్ ఫీజు కట్టడానికి కూడా ఆర్థిక స్తోమత లేదు. లా కాలేజీలో అడ్మిషన్ ఫీజు కట్టాలి. నా కుమారుడు స్కూల్ ఫీజు కూడా కట్టాలి. నా జీతం నాకు ఇప్పించండి’ అంటూ సంస్థ యాజమాన్యాన్ని వేడుకుంటున్నాడు.

లోడర్ గా సింగ్ కు నెలకు రూ.28వేలు నుంచి 38వేల మధ్య వేతనం వస్తుంది. తన జీతాన్ని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్న సింగ్ పరిస్థితి చెప్పుకోలేని దుస్థితి. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు.. జీతాలు లేవని.. ఉద్యోగం మానేసి.. మరో ఎయిర్ లైన్ లో ఉద్యోగంలో చేరేందుకు ప్రయత్నిస్తే.. అక్కడ తక్కువ జీతానికి పనిచేయాలి. ప్రస్తుతం వచ్చే జీతం కంటే.. సగం జీతం మాత్రమే ఇస్తామని సదరు కంపెనీలు ఆఫర్ చేస్తున్నారని సింగ్ వాపోయాడు. 

జెట్ ఎయిర్ వేస్ నమ్ముకుని పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఎయిర్ వేస్ లో దాదాపు 6వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జెట్ సంస్థ అందించే సర్వీసుల్లో ముంబైతో కలిపి మొత్తం ఐదు ఎయిర్ పోర్టులకు 1200 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని టార్గెట్ హస్పిటాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ గైక్వాండ్ తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల్లో ఎక్కువ మంది రిమోట్ విలేజీల నుంచి వచ్చి ఎయిర్ లైన్ లో చేరి జాబ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎయిర్ పోర్టులకు సమీపంలోని మురికి ప్రాంతాల్లో జీవిస్తూ నెలకు రూ.14వేల వరకు సంపాదిస్తున్నారు. జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు రద్దు చేయడంతో పనిలేక వీరి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. 

EMIలు కట్టలేక పైలట్ల రోదన :
జెట్ ఎయిర్ వేస్ లో చేరిన పైలట్ల పరిస్థితి కూడా చాలా దుర్భరంగా మారింది. మూడు నెలలుగా ఎయిర్ వేస్ జీతాలు చెల్లించకపోవడంతో తీసుకున్న లోన్లుపై ఈఎంఐలు కూడా చెల్లించలేక రోదిస్తున్నారు. గత రెండేళ్లగా జెట్ ఎయిర్ వేస్ లో ఉద్యోగం చేస్తున్నవారు నెలకు చెల్లించే ఈఎంఐలు కట్టలేకపోతున్నపరిస్థితి నెలకొంది. 2017లో జెట్ క్యాడెట్ ప్రొగ్రామ్ ను ప్రారంభించారు. దీనికి ఒక్కో విద్యార్థి ఎయిర్ లైన్ కు రూ.88 లక్షలు చెల్లించి కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు. తద్వారా బోయింగ్ 737 నడిపేందుకు ట్రైనింగ్ తీసుకున్నారు.

‘ఫ్యామిలీ సేవ్ చేసిన డబ్బుంతా తీసుకొచ్చి పైలట్ విద్యార్థులు క్యాడెట్ ప్రొగ్రామ్ లో చేరుతున్నారు. గత 1-2 ఏళ్లలో జెట్ రిక్రూట్ చాలామంది విద్యార్థులకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ లను జారీ చేసింది. స్పెషలైజ్ డ్ ట్రైనింగ్ కోసం విద్యార్థులు రూ.35 లక్షలు వరకు జెట్ కు చెల్లించారు. ఈ రెండు కేటగిరీల్లో విద్యార్థులకు మనీ తిరిగిరాదు. కనీసం జీతం కూడా రాదు. ఈ ఫీజు కోసం భారీ లోన్లు తీసుకుని చెల్లించాల్సిన పరిస్థితి వారిది’ అంటూ పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ కమాండర్ చెప్పుకొచ్చాడు.