నెల వ్యవధిలోనే జియోలో నాల్గవ పెద్ద పెట్టుబడి.. విలువ రూ .6,598.38 కోట్లు

  • Published By: vamsi ,Published On : May 17, 2020 / 02:16 PM IST
నెల వ్యవధిలోనే జియోలో నాల్గవ పెద్ద పెట్టుబడి.. విలువ రూ .6,598.38 కోట్లు

వరుసగా భారీ డీల్స్ సెట్ చేసుకుంటున్న రిలయన్స్ జియో మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఫేస్ బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ సంస్థలతో భారీ డీల్స్ కుదుర్చుకున్న రిలయన్స్ జియో.. గ్లోబల్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్‌తో మరో భారీ డీల్ కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో సదరు కంపెనీ రూ .6,598.38 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.

ప్రముఖ గ్లోబల్ టెక్ ఇన్వెస్టర్ల నుంచి నాలుగు వారాల వ్యవధిలో ఇది నాలుగవ అతిపెద్ద ఒప్పందం. జియో ప్లాట్‌ఫామ్స్‌లో జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం వాటాను కొనుగోలు చేస్తూ ఈ ఒప్పందం చేసుకుంది. జనరల్ అట్లాంటిక్ సంస్థ ఆసియాలో పెట్టిన పెట్టుబడుల్లో ఇదే అతి పెద్దది. ఇప్పుడు జనరల్ అట్లాంటిక్ పెట్టిన పెట్టుబడులతో కలిపి నాలుగు వారాల్లోనే రిలయన్స్ జియో రూ.67,194.75 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లుగా అయ్యింది.

భారత ఆర్థిక వ్యవస్థను తదుపరి దశకు తీసుకువెళ్లేందుకు డిజిటల్‌ కనెక్టివిటీ కీలకమనే ముఖేష్‌ అంబానీ విజన్‌ను తాము పంచుకుంటున్నట్లు చెప్పిన జనరల్ అట్లాంటిక్ సంస్థ.. భారత్‌లో డిజిటల్ సమాజం పెరుగుదలకు ఈ పెట్టుబడి ఉపయోగపడనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల కంపెనీలు అన్నీ అతలాకుతలం అవుతున్నట్లు ప్రకటించింది.