నెల వ్యవధిలో 5వ డీల్…జియోలో KKR రూ.11,367కోట్ల పెట్టుబడి

  • Published By: venkaiahnaidu ,Published On : May 22, 2020 / 01:27 PM IST
నెల వ్యవధిలో 5వ డీల్…జియోలో KKR రూ.11,367కోట్ల పెట్టుబడి

రిలయన్స్ జియో మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం KKR…11,367కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (RIL)శుక్రవారం(మే-22,2020)ప్రకటించింది. దీంతో జియోలోని 2.32 శాతం వాటా KKR‌కు బదిలీ చేయనున్నట్లు చెప్పింది.

జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఈ లావాదేవీ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లు కాగా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లని RIL తెలిపింది. RILలో నెల లోపు వ్యవధిలో ఇది వరుసగా 5వ పెట్టుబడి.  టెక్నాలజీ దిగ్గజ సంస్థలు ఫేస్ బుక్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ సిల్వర్ లేక్ సంస్థ,విస్తా ఈక్విటీ పార్టనర్స్,జనరల్ అట్లాంటిక్ ఇప్పటికే జియోలో పెట్టుబడులుగా పెట్టగా ఇప్పుడు ఆ వరుసలో కేకేఆర్ చేరింది.

9.99శాతం వాటా కోసం 5.7బిలియన్ డాలర్లు జియోలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఏప్రిల్-22న ఫేస్ బుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మే-8న 2.32శాతం వాటా కోసం 11,367కోట్లు జియోలో పెట్టుబడులు పెడుతున్నట్లు విస్తా ఈక్విటీ పార్టనర్స్ ప్రకటించింది. ఆ తర్వాత అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ 1.15శాతం వాటా కోసం జియోలో 5,655.75కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. మే-18న జనరల్ అట్లాంటిక్ కంపెనీ 1.34శాతం వాటా కొనుగోలు కోసం జియో ఫ్లాట్ ఫాంలలో 6,598.38కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది.

ఇప్పుడు KKRతో కొత్త డీల్ తో జియోలో ఇప్పటి వరకు వివిధ కంపెనీల పెట్టుబడుల విలువ రూ.78,562 కోట్లకు చేరింది. ప్రపంచంలో ఆర్థికపరమైన సంస్థల్లో ఒకటైన కేకేఆర్‌‌ మాకు బిజినెస్‌ పార్టనర్‌‌ కావడం ఆనందంగా ఉంది. దేశ ప్రజలందరికీ ప్రయోజనం చేకూరేలా భారత్‌ను డిజిటల్ దేశం మార్చేందుకు కేకేఆర్‌‌తో కలిసి పనిచేస్తామని రిలయన్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు.