మార్చి 31 డెడ్‌లైన్ : పాన్-ఆధార్ లింక్ మస్ట్

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 04:09 AM IST
మార్చి 31 డెడ్‌లైన్ : పాన్-ఆధార్ లింక్ మస్ట్

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ముఖ్య గమనిక. ముందు ఐటీ శాఖ దగ్గర పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలి. అది కూడా 2019, మార్చి 31వ తేదీలోగానే.  లేదంటే ఐటీ శాఖ మీ రిటర్న్‌లను స్వీకరించదు. ఈ మేరకు ఆధార్-పాన్ మస్ట్‌గా అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా  బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, స్కూల్ దరఖాస్తులకు ఆధార్ అనుసంధానించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు పాన్ కార్డుతో మాత్రం అనుసంధానం తప్పనిసరి అని చెప్పిన సంగతి  తెలిసిందే.

 
దేశంలో పాన్‌కార్డు కలిగిన వారిలో దాదాపు సగం మంది దానిని ఆధార్‌తో అనుసంధానం చేయలేదని సీబీడీటీ మాజీ చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. ఐటీ శాఖ మొత్తం 42కోట్ల పాన్‌కార్డులను  ఇప్పటివరకు జారీ చేస్తే అందులో కేవలం 23కోట్ల పాన్‌కార్డులు మాత్రమే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. దీంతో మిగతా వారు కూడా వెంటనే అనుసంధానం చేసుకోవాలంటూ ప్రభుత్వం  ఇప్పటికే పలుమార్లు గడువు విధించింది. తాజాగా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు 2019 మార్చి 31లోగా పాన్-ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

 

పాన్-ఆధార్ లింక్ చేయకపోయినా ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు… 2018 సెప్టెంబర్2లో ఇద్దరు వ్యక్తులకు అనుమతి ఇచ్చింది. దాంతో చాలామంది అనుసంధానం విషయాన్ని  పక్కన పెట్టారు. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. 2019 ఫిబ్రవరి 6వ తేదీన స్పష్టత ఇచ్చింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే  ప్రతి వ్యక్తి తన ఆధార్-పాన్ కార్డు నెంబర్లను ఐటీ శాఖ దగ్గర లింక్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. 2018 సెప్టెంబర్‌లోనే ఆధార్ రాజ్యాంగబద్దమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాకపోతే ఆధార్  నెంబర్‌ను మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతాలతో ముడిపెట్టడాన్ని తోసిపుచ్చింది. సీబీడీటీ తాజా ఉత్తర్వులతో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను ఐటీ శాఖ మరింత  సమర్థవంతంగా పసిగట్టే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.