వైన్‌ షాపుల సీలు తొలగించి మరీ మద్యం అమ్మకాలు, ఎమ్మార్పీపై 3 రెట్లు వసూలు .. లాక్‌డౌన్‌ ను క్యాష్ చేసుకుంటున్నారు

వైన్‌ షాపుల సీలు తొలగించి మరీ మద్యం అమ్మకాలు, ఎమ్మార్పీపై 3 రెట్లు వసూలు .. లాక్‌డౌన్‌ ను క్యాష్ చేసుకుంటున్నారు

కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని షాపులు బంద్ అయ్యాయి. మద్యం షాపులు కూడా మూతబడ్డాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. అయినా ప్రజల ఆరోగ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆదాయాన్ని వదులుకుంది. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు వైన్స్ షాపులు తెరిచే ప్రసక్తి లేదని చెప్పారు. అయితే లాక్ డౌన్ ను కొందరు మద్యం షాపుల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాకు తెరలేపారు.

వరంగల్ జిల్లాలో బార్లు, వైన్ షాపుల యజమానుల బరితెగింపు:
లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో బార్లు, వైన్‌షాపుల యజమానులు కొందరు బరితెగిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు తమ షాపునకు వేసిన సీల్‌ తొలగిస్తున్నారు. తాళాలు తీసి షాపుల్లోని మద్యం నిల్వలను అక్రమంగా మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నర్సంపేటలో ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఓ వైన్‌షాపు నిర్వాహకులు, పరకాలలో ఒక వైన్‌ షాపు యజమాని అడ్డంగా దొరికిపోయారు. వీరిపై ఎక్సైజ్‌, పోలీసుశాఖ అధికారులు వివిధ కేసులు నమోదు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు మార్చి 22న జనతా కర్ఫ్యూ జరిగిన విషయం తెలిసిందే. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు మార్చి 21న జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌ షాపులను మూసివేసి సీలు వేశారు. అనూహ్య రీతిలో మార్చి 23వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఆయా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌షాపులు మూసి ఉండాల్సిందేనని, తాళాలకు వేసిన సీలు తెరువొద్దని ఎక్సైజ్‌శాఖ అధికారులు షాపుల యజమానులకు చెప్పారు. దీంతో మార్కెట్‌లో మద్యం కొరత ఏర్పడింది.

రూ.వెయ్యి ఎమ్మార్పీ మద్యం బాటిల్‌ రూ.4 వేలకు అమ్మకం:
బెల్ట్‌షాపుల నిర్వాహకులు అప్పటికే తమ వద్ద ఉన్న మద్యం నిల్వలను ధర పెంచి అమ్మారు. ఎమ్మార్పీపై రెండు నుంచి మూడు రెట్ల వరకు ధర పెరిగింది. ఉదాహరణకు రూ.వెయ్యి ఎమ్మార్పీ మద్యం బాటిల్‌కు ప్రస్తుతం రూ.4 వేల రేటు పలుకుతుంది. దీంతో బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌షాపుల యజమానులు పలువురు ఇదే అదనుగా భావిస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు వేసిన సీల్‌ నిర్భయంగా తొలగించి మద్యం నిల్వలను మార్కెట్‌కు తరలించి అధిక రేట్లపై అమ్ముతున్నారు.

కేసులైనా… కాసులే టార్గెట్‌
లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక మొదట నర్సంపేటలో ఉన్న మానస బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులు ఎక్సైజ్‌ అధికారులు వేసిన సీలు తొలగించి మద్యం నిల్వలు గుట్టుచప్పుడు కాకుండా బయటికి తీసి అమ్మారు. సమాచారం అందగానే ఎక్సైజ్‌శాఖ అధికారులు ఈ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. షాపు యజమానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. లాక్‌డౌన్‌ తర్వాత దీనిపై ఎక్సైజ్‌శాఖ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌(డీసీ) నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం పరకాలలో ఓ వైన్‌షాపు యజమాని తన షాపునకు వేసిన సీలును తొలగించడంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

షాపుల లైసెన్సు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చినా:
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇలాంటి సంఘటనలపై ఇటీవల ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి సీలు తొలగించి మద్యం అమ్మిన షాపుల లైసెన్సు రద్దు చేస్తామని ప్రకటించారు. ఇవేమీ పట్టనట్టు అదేరోజు అర్ధరాత్రి దాటాక నర్సంపేటలో నెక్కొండ రోడ్డులో ఉన్న శ్రీనివాస వైన్‌షాపు నిర్వాహకులు తమ షాపు తాళాల సీలు తొలగించారు. షాపులో ఉన్న మద్యం నిల్వల నుంచి మూడు పెట్టెల్లోని ఫుల్‌, క్వార్టర్‌ బాటిళ్లను బయటకు తెచ్చారు. వీటిని కారులో తరలిస్తూ స్థానిక పోలీసులకు దొరికిపోయారు. కారు, మూడు పెట్టెల్లోని మద్యం బాటిళ్లను స్వాధీన పరుచుకుని కారులో ఉన్న రవి, రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం నిల్వలతో పట్టుబడిన కారు ముందు భాగంలో అద్దంపై పోలీసు అని రాసిన స్టిక్కర్‌ వేసి ఉంది. కారు లోపల పోలీసు టోపీ కూడా ఉంది. వరంగల్‌ మహానగరానికి చెందిన వ్యక్తులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ఆపకుండా కారు అద్దంపై పోలీసు స్టిక్కర్‌తో మద్యం అక్రమ రవాణాకు దిగినట్లు సమాచారం. నర్సంపేట పోలీసులు కారు, మద్యం సీజ్‌ చేసి ఈ వ్యవహారంలో ఒక హోంగార్డు సహా వైన్‌షాపు నిర్వాహకులు నలుగురిని ఇటీవల అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

బార్ లు, రెస్టారెంట్లు, వైన్స్ షాపులకు రెండో తాళం:
నర్సంపేటతోపాటు జిల్లాలోని మరికొన్ని వైన్‌షాపుల నిర్వాహకులు తాళాల సీలు తొలగించి షాపుల్లోని మద్యం నిల్వలను బయటకు తరలించినట్లు తెలుస్తుంది. సీలు తొలగిస్తున్నట్లు భావిస్తున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు మంగళవారం జిల్లాలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌షాపులకు తమ శాఖ నుంచి రెండో తాళం వేశారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ప్రతి బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వైన్‌షాపులో మార్చి 21 క్లోజింగ్‌, ఓపెనింగ్‌ బ్యాలెన్సును పరిశీలిస్తామని, తేడా వచ్చిన షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్‌ అధికారి పీ శ్రీనివాసరావు చెప్పారు.

లాక్‌డౌన్‌లోనూ జోరుగా మద్యం అమ్మకాలు:
లాక్‌డౌన్‌లోనూ మహబూబ్ నగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వైన్‌షాపుల యజమానులు కొందరు సీల్‌ను తొలగించి అధిక ధరలకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 52 వైన్‌ షాపులకు ఎక్సైజ్‌ అధికారులు సీల్‌ వేశారు. కొందరు వ్యాపారులు మాత్రం అర్ధరాత్రి షాపులను తెరిచి సరుకును తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏప్రిల్ 7న డోర్నకల్‌లో ఒక వైన్‌షాపు నుంచి రూ.40వేల పైచిలుకు మద్యాన్ని తరలిస్తుండగా డోర్నకల్‌ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. 13న మహబూబాబాద్‌ జిల్లా బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఒక వైన్స్‌ షాపు నుంచి మద్యాన్ని తరలించడాన్ని అధికారులు గమనించి ఆ షాపుపై కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 22న అర్ధరాత్రి కురవి మండలకేంద్రంలోని ఒక వైన్‌ షాపులో సరుకును మూడు వాహనాల ద్వారా తరలించే క్రమంలో స్థానికులు గమనించి మద్యం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ అధికారులు వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ విషయంపై మహబూబాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ రమేశ్‌చందర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందగానే కురవి మండలకేంద్రంలోని షాపునకు వెళ్లి తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. స్టాక్‌ రిజిస్టర్‌ ప్రకారం మద్యం నిల్వల లెక్క సరిపోయిందని, ఈ మేరకు నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించినట్లు ఆయన తెలిపారు.