ఖజానా నింపిన ఖనిజాలు : కేటీఆర్ కృషి

  • Published By: chvmurthy ,Published On : January 26, 2019 / 01:24 PM IST
ఖజానా నింపిన ఖనిజాలు : కేటీఆర్ కృషి

హైదరాబాద్: రాష్ట్రంలో మైనర్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలతో గత ఐదేళ్ళలో గనుల శాఖ ఆదాయం రెట్టింపు అయ్యింది. ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది. గనులశాఖ ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 4,060.03 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా గత డిసెంబర్ నెల చివరినాటికి రూ.2,957.11 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది నిర్దేశిత లక్ష్యం కంటే రూ.51.33 కోట్లు అధికంగా ఉండటం విశేషం.
మైనర్ మినరల్స్‌లో రూ.1,015.05 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా…… ఇప్పటికే రూ.949.59 కోట్లు వచ్చింది. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికి నిర్దేశిత లక్ష్యం రూ.690.24 కోట్లు కాగా.. అంతకంటే అధికంగా రూ.259 కోట్లు రావడం చెప్పుకోదగ్గ అంశం. ఇది నిర్దేశిత లక్ష్యం కంటే 138 శాతం ఎక్కువ. కాగా, గత సంవత్సరం కంటే రూ.362 కోట్లు అధికంగా ఆదాయం వచ్చిందని గనులశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 
ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి గనులశాఖ ఆదాయం పెంపులో మైనర్ మినరల్స్‌ది కీలకపాత్ర అవుతుందని కానున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేజర్ మినరల్స్ ద్వారా రూ.185 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఇప్పటికే రూ.168 కోట్లు ఆదాయం వచ్చింది. సింగరేణి బొగ్గుగనుల ద్వారా రూ.1,553 కోట్ల ఆదాయం వచ్చింది. ఇసుక ద్వారా రూ.468 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ.446 కోట్లు వచ్చింది. ఇలా అన్ని రకాల గనుల ద్వారా రూ.నాలుగువేల కోట్ల ఆదాయలక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతామని అధికారులు అంచనా వేస్తున్నారు. 
ఫలితాలిస్తున్న కేటీఆర్ కృషి 
తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక గనుల తవ్వకాలు, లీజులు, రాయల్టీ వసూళ్లు, నిఘా వ్యవస్థను పటిష్ఠపర్చడం, పారదర్శక విధానాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో అప్పటి గనులశాఖ మంత్రి కేటీఆర్ పలు సంస్కరణలు అమలుచేశారు. అనుమతులు, లీజుల మంజూరులో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టారు. మైనర్ మినరల్స్‌లో 2,793 లీజులు ఇచ్చారు. లీజులు తీసుకొని నిరుపయోగంగా ఉంచేవారిపట్ల కఠినంగా వ్యవహరించారు. బినామీ లీజులకు చెక్‌పెట్టారు. కేటాయించిన లీజు ప్రాంతాల్లో మాత్రమే తవ్వకాలు జరిపేలా జియో ఫెన్సింగ్ అమలుచేశారు. 
2014-15 ఆర్థిక సంవత్సరంలో గనులశాఖ ద్వారా రూ.1,968 కోట్ల ఆదాయం రాగా….. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.నాలుగువేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మేజర్ మినరల్స్ కేంద్రం పరిధిలో, మైనర్ మినరల్స్ రాష్ట్రం పరిధిలో ఉంటాయి. మైనర్ మినరల్స్ నిర్వహణపై పూర్తిస్థాయి దృష్టిపెట్టడంతో గణనీయంగా ఆదాయం పెరిగింది.