ఇంటికే ATM వస్తుంది: తపాలా శాఖ కొత్త నిర్ణయం

  • Published By: madhu ,Published On : November 7, 2019 / 03:46 AM IST
ఇంటికే ATM వస్తుంది: తపాలా శాఖ కొత్త నిర్ణయం

నగదు కోసం ఏటీఎం వద్దకు, బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదు. ఏమీ అవసరం లేకుండా డబ్బును ఇంటివద్దే డ్రా చేసుకోవచ్చు. కేవలం మొబైల్ లేదా ల్యాండ్ లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నెంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు..ఏరియా పోస్ట్ మేన్ మొబైల్ మైక్రో ఏటీఎంతో ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు..అవసరమైన మొత్తాన్ని రూ. 100 నుంచి రూ. 10 వేల వరకు పొందే వీలుంది.

బ్యాంకింగ్ సేవలందిస్తూ..వచ్చిన తపాలా శాఖ ఇటీవలే వివిధ బ్యాంకుల ఖాతాదారులకు సైతం ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఏ బ్యాంకులో ఖాతాలో ఉన్నా నగదు విత్ డ్రా చేసుకొనే వెసులుబాటును కల్పించింది తపాలా శాఖ. 

> ఇందులో 950 మంది పోస్ట్ మేన్‌లకు శిక్షణనిచ్చింది. మొబైన్‌ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్‌లను డౌన్ లోడ్ చేసి మొబైల్ ఫోన్లను సైతం అందచేసింది. 
> 155299 నంబర్‌కు రిక్వెస్ట్ పంపగానే..ఆ ఏరియా పోస్ట్ మేన్ మొబైల్ మైక్రో ఏటీఎంతో ఇంటి వద్దకు వస్తారు. 
> పేరు, మొబైల్ నెంబర్ తీసుకుని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే ఆధార్ నంబర్ అడుగుతుంది. 
> అది నమోదు చేయగానే..ఎంత నగదు కావాలి ? బ్యాంకు పేరు..వివరాలను ఎంటర్ చేయాలి. ఆధార్‌తో ఆ బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉండాల్సి ఉంటుంది. 
> బయోమెట్రిక్ అందిస్తే..అది ఆమోదం కాగానే నగదు విత్ డ్రా, మినీ స్టేట్ మెంట్, బ్యాలెన్స్ విచారణ, ఫుల్ మనీ ఆఫ్షన్లు కనిపిస్తాయి.