భారీగా పెరిగిన అపరకుబేరుడు ఆస్తి: అంబానీ ఆస్తి ఎంతో తెలుసా?

  • Published By: vamsi ,Published On : December 25, 2019 / 12:59 AM IST
భారీగా పెరిగిన అపరకుబేరుడు ఆస్తి: అంబానీ ఆస్తి ఎంతో తెలుసా?

భారత అపరకుబేరుడు, ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీకి ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. మట్టిని పట్టుకున్నా బంగారం అవుతుంది అనే సామెతగా.. ముకేష్ అంబానీ ఏది పట్టుకున్నా కూడా అంతకు అంతగా ఆదాయం తెచ్చిపెట్టింది.

బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. డిసెంబర్ 23వ తేదీ నాటికి ముకేష్ అంబానీ సంపద 17మిలియన్ డాలర్లు ( అంటే దాదాపు రూ.1.28 లక్షల కోట్లు)పెరిగింది. దాంతో మొత్తం సంపద 6,100 కోట్ల డాలర్లకు(రూ.4.27 లక్షల కోట్లు) చేరకుంది.

ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీగా(40శాతం పెరిగాయి) పుంజుకోవడం.. ఈ-కామర్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు.. మూడేళ్ల క్రితం రిలయన్స్‌ జియో సేవల ప్రారంభం.. అవి మార్కెట్లో దూసుకుని పోవడం ముకేశ్‌ ఆస్తి పెరగడానికి సహాయపడింది. 2021 ఆరంభం నాటికి రిలయన్స్‌ గ్రూప్‌ అప్పులు లేని కంపెనీగా అవతరించాలంటూ ప్రణాళిక వేసుకున్న ముఖేశ్‌ అంబానీ ఈ విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే రిలయన్స్‌ ఆయిల్‌ టు కెమికల్‌ వ్యాపారంలో కొన్ని వాటాలను సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోకు అమ్ముతున్నారు.

2019లో సంపద పెరుగుదల విషయంలో ప్రపంచ కుబేరులైన జెఫ్‌ బెజోస్‌, జాక్‌ మా కూడా వెనకబడే ఉన్నారు. ఇక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా సంపద ఈ ఏడాది 11.3 బిలియన్‌ డాలర్లు పెరగగా.. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ 13.2 బిలియన్‌ డాలర్లు కోల్పోయాడు.