స్టాక్ మార్కెట్లపై కరోనా పంజా.. భారీ పతనం.. 6.6 లక్షల కోట్లు నష్టం!

స్టాక్ మార్కెట్లపై కరోనా పంజా.. భారీ పతనం.. 6.6 లక్షల కోట్లు నష్టం!

New Coronavirus Strain infects Global Markets : స్టాక్ మార్కెట్లపై కొత్త రకం కరోనా పంజా విసిరింది. కొత్త రకం కరోనా వైరస్‌ విజృంభణతో భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టింది. కరోనా పంజా దెబ్బకు జోరుమీదున్న సూచీలన్నీ భారీ పతనాన్ని చవిచూశాయి. కరోనా భయాలు మార్కెట్లను వెంటాడటంతో ఏడు నెలల్లో సూచీలు భారీ పతనమై కుప్పకూలాయి. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ భారత్‌ స్టాక్ మార్కెట్లు సహా ప్రపంచ మార్కెట్లను పతనానికి కారణమైంది. ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించడంతో బీఎస్‌ఈ సూచీ ఏకంగా 1406.73 పాయింట్లు నష్టపోయింది.

2020 మే తర్వాత సూచీకి ఇదే అతి పెద్ద పతనంగా మార్కెట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా దెబ్బకు రూ. 6.6 (ట్రిలియన్లు) లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైపోయింది. ముందుగా జాగ్రత్తగా ట్రేడర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు ముందుకు వచ్చారు. అమ్మకాలకు ఆసక్తి చూపించారు. ఫలితంగా BSE సెన్సెక్స్‌ 1,406.73 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 45,553.96 వద్ద ముగిసింది. మే 4 తర్వాత అతిపెద్ద ఒక్కరోజు పతనం ఇదే. 2వేల పాయింట్లకు పైగా కోల్పోయి 45 వేల దిగువకు జారుకుంది. కాసేపటికి మళ్లీ పుంజుకుంది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ప్రామాణిక సూచీ నిఫ్టీ సైతం 432.15 పాయింట్లు 3.14 శాతం క్షీణించి 13,328.40 వద్ద పతనమైంది. దలాల్‌ స్ట్రీట్‌ దమనకాండలో రూ.6.6 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైపోయింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీలన్నింటి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.178,79,323 కోట్లకు పతనమైంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి.

ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ONGC అత్యధికంగా 9.15 శాతం క్షీణించింది. బీఎ్‌సఈలోని మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, యుటిలిటీస్‌, బేసిక్‌ మెటీరియల్స్‌, ఇండస్ట్రియల్స్‌, పవర్‌, బ్యాంకెక్స్‌ సూచీలు 6.05 శాతం వరకు పతనమయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.496 పెరిగింది.

తద్వారా బంగారం ధర రూ.50,297కు చేరింది. కిలో వెండి రేటు రూ.2,249 మేర ఎగబాకింది. దాంతో వెండి ధర రూ.69,477కు పెరిగింది. ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలతో బంగారం, వెండికి గ్లోబల్‌ మార్కెట్లో డిమాండ్‌ పెరిగింది. దేశీయంగానూ బులియన్‌ రేట్లు భారీగా పుంజుకున్నాయి.