25 నుంచి ఎగరనున్న విమానాలు.. ఛార్జీలపై 3 నెలల నియంత్రణ

  • Published By: srihari ,Published On : May 22, 2020 / 12:55 AM IST
25 నుంచి ఎగరనున్న విమానాలు.. ఛార్జీలపై 3 నెలల నియంత్రణ

మే 25నుంచి విమాన సర్వీసులు పున: ప్రారంభం కానున్నాయి. ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ ధరలపై నియంత్రణ అమలు చేస్తామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. మెట్రో నగరాల మధ్య విమానాలను నడపడానికి అనుమతిచ్చిన సర్వీసుల్లో 33.33శాతం మొదలవుతాయని తెలిపారు. మెట్రో- నాన్ మెట్రో నగరాల మధ్య డిపార్చర్స్ వారానికి వందకు మించి ఉంటే, అక్కడ అనుమతించిన సర్వీసుల్లో మూడోవంతే అనుమతిస్తున్నట్లు చెప్పారు. నగరాల మధ్య డిపార్చర్స్ వారానికి 100 లోపు ఉంటే అనుమతిచ్చిన వాటిల్లో 33శాతం సర్వీసులను ఏ మార్గంలోనైనా నడుపుకునే స్వేచ్ఛను విమానయాన సంస్థలకు వదిలేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన మార్గాల్లో నడపడానికి అనుమతిచ్చిన సర్వీసుల్లో మూడోవంతును ఎక్కడికైనా నడుపుకోవచ్చని వెల్లడించారు. ఈ నిబంధనలు ఆర్సీఎస్ ఉడాన్ మార్గాలకు వర్తించవని పేర్కొన్నారు. మెట్రో నగరాల కిందకు ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వస్తాయని చెప్పారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 24వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు.

దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేనని హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రస్తుత అనుభవం ఆధారంగానే దేశీయ సర్వీసుల సంఖ్య పెంచుకుంటూ పోతామని, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభిస్తామని అన్నారు. విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చే వందే భారతీయ మిషన్‌లో ప్రైవేట్ విమానయాన సంస్థలు కూడా పాల్గొనవచ్చని మంత్రి తెలిపారు.

ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో జీఎంఆర్ సంస్థ HOI యాప్ ద్వారా భోజనం అందిస్తోంది. ప్రయాణికులు ఈ యాప్ ద్వారా, అక్కడి అవుట్ లెట్లను ఎంచుకుని ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్డరు సిద్ధమైన వెంటనే వినియోగదారుడికి మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ వస్తుంది. ఆన్ లైన్‌లో డబ్బు చెల్లించి దాన్ని తీసుకోవచ్చు. విమానాశ్రయ కార్యకలాపాల వివరాలన్నీ ఈ యాప్ ద్వారా ప్రయాణికుడు తెలుసుకోవచ్చు. రియల్ టైమ్ ఫ్లైట్ స్టేటస్ అలర్ట్స్, బోర్డింగ్ గేట్ ఇన్ఫర్మేషన్, చేరుకోబోయే గమ్యస్థానంలో వాతావరణ పరిస్థితులన్నీఈ యాప్ లో చెక్ చేసుకోవచ్చునని జీఎంఆర్ సంస్థ తెలిపింది.

దేశీయ విమానాల్లో ప్రయాణించినవారు గమ్యం చేరాక క్వారెంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. వందే భారత్ కింద విదేశాల నుంచి వచ్చే వారు సుదీర్ఘకాలం ప్రయాణం చేసి వస్తారు కాబట్టే వారిని క్వారెంటైన్‌కు పంపుతున్నామని తెలిపారు. దేశీయ ప్రయాణాలు చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి ఆ అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణ సమయాన్ని ఏడు విభాగాలుగా విభజించి, వాటికి కనిష్ఠ, గరిష్ఠ ధరలను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతి విమానంలో 40 శాతం సీట్లను కనిష్ఠ, గరిష్ఠ ఛార్జీల మధ్యస్థ ధరకు విక్రయించాలని షరతు విధించినట్లు తెలిపారు. ఢిల్లీ- ముంబయికు కనీస ఛార్జి రూ.3,500 ఉంటే.. గరిష్ఠ ఛార్జి రూ.10వేలు. 40శాతం సీట్లను కనిష్ఠ, గరిష్ఠ మధ్య ధర రూ.6,750కి విక్రయించాల్సిందిగా సూచించారు.  

వృద్ధులు, గర్భిణీలు, ఆరోగ్య సమస్యలున్న వారు, వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణ అయ్యే వరకు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ప్రతి ప్రయాణికుడి మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్ ఉండాలి. అందులో ఎర్రమార్క్ వచ్చినవారిని ప్రయాణానికి అనుమతించరు. ఈ యాప్ లేనివారు స్వీయ ప్రకటన పత్రం (సెల్ఫ్ డిక్లరేషన్) ఇవ్వాలి.
కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో నివసించే వాళ్లకు, కరోనా పాజిటివ్‌గా తేలిన వాళ్లకు ప్రయాణ అనుమతి లేదు. విమానాశ్రయాల్లో ప్రస్తుతం భౌతిక తనిఖీ (చెక్ ఇన్) కౌంటర్లు నిర్వహించడం లేదు. వెబ్ చెక్ఇన్ చేసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పరిశీలన (థర్మల్ స్క్రీనింగ్) తప్పనిసరి చేయాలి. విమానాల్లో భోజనం ఇవ్వరు. తాగునీటి సీసాలు గ్యాలరీ ప్రాంతం, సీట్ల వద్ద మాత్రమే ఇస్తారు. 

ప్రతి ప్రయాణికునికి ఒక చెకిన్ బ్యాగ్ మాత్రమే అనుమతిని ఇస్తారు. విమానాశ్రయాల్లో అడుగుపెట్టిన తర్వాత కూడా ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలి. విమానం బయలుదేరే సమయానికి 2 గంటల ముందే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకుంటారు. భౌతిక దూరం నిబంధన తప్పనిసరిగా పాటించాలి.
ప్రయాణికులు ప్రొటెక్టివ్ గేర్, శానిటైజర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేబిన్ సిబ్బంది పూర్తిస్థాయి పీపీఈలు ధరించాల్సిందిగా తెలిపారు. గమ్యస్థానం చేరాక, అక్కడి రాష్ట్రాలు నిర్దేశించిన వైద్య మార్గదర్శకాలు అనుసరించాల్సిందిగా పలు సూచనలు చేశారు. 

Read: రైల్వే బుకింగ్‌‍లు ప్రారంభం.. జూన్ 1 నుంచి రైళ్ల రాకపోకలు