కేంద్రం గుడ్ న్యూస్ : రూ.25 లక్షల లోపు పన్ను ఎగవేతదారులకు రిలీఫ్

  • Published By: sreehari ,Published On : September 14, 2019 / 01:02 PM IST
కేంద్రం గుడ్ న్యూస్ : రూ.25 లక్షల లోపు పన్ను ఎగవేతదారులకు రిలీఫ్

చిన్న స్థాయి పన్నుచెల్లింపు, ఎగవేతదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.25 లక్షల వరకు పన్ను చెల్లింపు, ఎగవేతదారులు ఆదాయ పన్ను శాఖ నుంచి న్యాయ విచారణ చర్యలు ఎదుర్కొవాల్సిన అవసరం ఉండదని వెల్లడించింది. శనివారం (సెప్టెంబర్ 14)న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు.

రూ.25 లక్షల లోపు పన్ను ఎగవేతలపై కొలీజియంకు చెందిన ఇద్దరు అధికారుల ముందస్తు ఆమోదంతో మాత్రమే విధానపరమైన లేదా అధిక పన్ను ఎగవేతలకు ప్రాసిక్యూషన్ జరుగుతుందని ఆమె అన్నారు. ఎవరైనా ప్రాసిక్యూషన్ ప్రారంభించాలనుకుంటే అతడు లేదా ఆమెను అలా అనుమతించడం జరుగుతుందని ఆమె అన్నారు.  

కొలీజియం ఏర్పాటు చేసే ఇద్దరు అధికారులు చీఫ్ కమిషనర్ ఆదాయ పన్ను (సిసిఐటీ) లేదా డైరెక్టర్ జనరల్ ఆదాయపు పన్ను (డీఐజిటి) నుంచి ఉంటారు. అర్హులైన కేసులలో మాత్రమే ప్రాసిక్యూషన్ జరుగుతుంది. చిన్న చిన్న పన్ను ఎగవేతదారుల కోసం ప్రాసిక్యూషన్ నిర్వహించడం జరగదని నిర్మల స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకున్న ప్రాసిక్యూషన్ సడలింపు చర్యల్లో భాగంగా ఆర్థిక మంత్రి పై విధంగా ప్రకటించారు. చిన్న విధానపరమైన డిఫాల్ట్ లతో చిన్న పన్ను చెల్లింపుదారులపై విచారణ జరగదని ఆమె తెలిపారు. ఐటీ దాఖలులో జరిగే చిన్న పొరపాట్లపై కూడా గతంలో మాదిరిగా కఠిన చర్యలు ఉండవని తెలిపారు. 

ప్రాసిక్యూషన్ కు అర్హులైన వారి కేసులు లేదా నేరం స్థాయికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. గత నేరాలకు సంబంధించిన దరఖాస్తుల్లో నిర్ణీత గడువు షెడ్యూల్ సమయానికి పూర్తికాని దరఖాస్తులను  2019 డిసెంబర్ 31 నాటి వరకు పంపవచ్చునని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు.