దిగివస్తున్న ఉల్లిధరలు : సామాన్యులకు ఊరట

  • Published By: chvmurthy ,Published On : December 15, 2019 / 12:45 PM IST
దిగివస్తున్న ఉల్లిధరలు : సామాన్యులకు ఊరట

గత కొద్ది నెలలుగా సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిన ఉల్లిపాయల ధరలు ఇప్పుడిప్పుడే కాస్త దిగివస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్‌లకు ఉల్లి దిగుమతి మొదలైంది. గత రెండు నెలలుగా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపంట  దెబ్బతినటంవల్ల హైదరాబాద్‌కు ఉల్లి సరఫరా తగ్గింది. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ ఉల్లిపంట ఆశించనంతగా రాకపోవడంతో, ఉత్పత్తి అయిన ఉల్లిలో చాలా మటుకు వర్షాలకు తడిసి పాడైపోయింది. దీంతో ఉల్లి ధరలు పైపైకి దూసుకుపోయాయి. తెలుగు రాష్ర్టాల్లోనే కాక దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ ఉల్లి ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి.

దీంతో చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఉల్లిని వాడటం మానేశారు. ఒకానొక దశలో కొన్ని రాష్ట్రాల్లో ఉల్లిధర ఏకంగా 200 రూపాయలుకు కూడా చేరింది. ఈ పరిస్ధితుల్లో కేంద్రం ఆఫ్గానిస్తాన్, ఇతర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంది. దేశంలోని చాలా రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం ఉల్లిని సరఫరా చేసి పేదలకు సబ్సిడీ ధరలకే విక్రయించే ఏర్పాట్లు చేసింది. అయినా డిమాండ్‌కు తగినంత సరఫరా లేక పోయింది.

తెలంగాణ ప్రభుత్వం  కూడా ఈజిప్ట్‌నుంచి కొంత ఉల్లిని దిగుమతి చేసుకుని రైతుబజార్ల ద్వారా కిలో 50 రూపాయలకు  వినియోగదారులకు అందించింది. అయితే ఇటీవల మహారాష్ట్రలో కొత్తపంట చేతికి రావడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఉల్లిసరఫరాను ప్రారంభించారు. మహారాష్ట్రలో పండే అధికశాతం ఉల్లి హైదరాబాద్‌కే తరలి వస్తోంది. దీంతో గత కొన్నిరోజులుగా ఉల్లిసరఫరా పెరగడంతో ధరలు కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్  హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఫస్ట్‌క్వాలిటీ ఉల్లిపాయ క్వింటాల్‌కు 13వేల నుంచి 14వేల రూపాయలు దాకా పలుకుతోంది. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి 120 నుంచి 150 రూపాయలు మధ్య అమ్ముతున్నారు. ఇక సెకండ్‌ క్వాలిటీ ఉల్లి పాయలైతే హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌కు 7వేల నుంచి 11వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. రిటైల్‌ మార్కెట్‌లో దీన్ని 70 నుంచి 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. జనవరి నాటికి భారీఎత్తున ఉల్లి దిగుమతి పెరుగుతుందని, దీంతో ధరలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.