కన్నీళ్లు పెట్టిస్తోంది : కిలో ఉల్లి ధర రూ.100

  • Published By: sreehari ,Published On : November 5, 2019 / 09:07 AM IST
కన్నీళ్లు పెట్టిస్తోంది : కిలో ఉల్లి ధర రూ.100

ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. తగ్గినట్టే తగ్గిన ఉల్లి ధరలు అమాంత ఆకాశాన్ని అంటాయి. కిచెన్‌లో నిత్యవసరమైన ఉల్లిగడ్డ వినియోగదారులను కన్నీళ్లు పెట్టిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.100లకు చేరువైనట్టు కనిపిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.90 పలుకుతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. 2019 ఏడాదిలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఒక్కసారిగా కిలో ఉల్లి ధర రూ.80లను తాకింది. ఉల్లి కొరత కారణంగా ఒక్కసారిగా ధరలు కూడా పెరిగాయి.

మహారాష్ట్రలోని కొన్ని జోన్లలో బాగా పండే ఉల్లి పంటల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. అకాల వర్షాలు ఒక కారణంగా చెప్పవచ్చు. భారీ వర్షాలతో ఉల్లి పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందిన రిపోర్టుల ప్రకారం.. లాస్లాగన్ హోల్ సేల్ మార్కెట్ సగటున ఉల్లిధరలు కిలో రూ.55.50 వరకు పెరిగాయి. నవంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలతో పెద్దమొత్తంలో ఉల్లి పంటలు దెబ్బతిన్నాయని, అందుకే ఉల్లి ధరలు ఎక్కువగా పెరిగాయని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా గత నెలలోనే ఉల్లిధరలు కాస్త తగ్గినట్టు కనిపించాయి. కానీ, కస్టమర్లు మాత్రం మార్కెట్లలో అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.90 మధ్య ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. కొత్త ఉల్లి పంట భారీగా నష్టం వాటిల్లడంతో కొంతమంది రైతులు తమ పాత స్టాక్ ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు.

దీంతో ఉల్లి ధరలు కిలో రూ.100 వరకు చేరుకునేలా ఉన్నాయి. హోల్ సేల్ మార్కెట్లో గత మూడు నెలల్లో ఉల్లి ధరలు నాలుగో వంతు పెరిగినట్టు రిపోర్టు తెలిపింది. కొత్త ఉల్లి పంట దెబ్బతినడంతో పాత స్టాక్ ఉల్లి ధరలు కూడా మార్కెట్లో భారీగా పెరిగాయని ఉల్లి రైతులు చెబుతున్నారు.