8 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, లాక్ డౌన్ వేళ కేంద్రం మరో గుడ్ న్యూస్

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 01:57 AM IST
8 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, లాక్ డౌన్ వేళ కేంద్రం మరో గుడ్ న్యూస్

కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా చాలా స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే ఉపాధి లేకపోవడం, ఆదాయం ఆగిపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. చేతిలో డబ్బు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారికి కొంత ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం. ఇప్పటికే లాక్ డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు మూడు వంట గ్యాస్ సిలిండర్లు(14.2కిలోలు) ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ వినిపించింది.

ఈసారి గృహావసరాల కోసం 5 కిలోల వంట గ్యాస్ ను ఉపయోగించే వినియోదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రాబోయే మూడు నెలల్లో 8 సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం(PMUY) 8కోట్ల మంది లబ్ధిదారులు మాత్రమే దీనికి అర్హులు. లాక్ డౌన్ నేపథ్యంలో 14.2 కిలోల సిలిండర్లు ఉపయోగించే పీఎంయూవై లబ్దిదారులకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 14.2 కేజీల సిలిండర్లు వాడే వారికి మూడు, 5కేజీల సిలిండర్లు వాడే వారికి 8 చొప్పున ఇవ్వనున్నారు. మూడు నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఇస్తారు.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కరోనా వెల్ఫేర్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం మార్చి 26న రూ.1.7 లక్షల కోట్లు కేటాయించింది. దాని కింద వంట గ్యాస్ ను ఉపయోగించే 8 కోట్ల మంది పేదలకు జూన్ వరకు మూడు సిలిండర్లను ఉచితంగా అందివ్వనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 27.87 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వారిలో పీఎం ఉజ్వల యోజన పథకం కింద 8కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. లాక్ డౌన్ అమలవుతున్న రోజు నుంచి ఇప్పటివరకు 50 నుంచి 60 లక్షల గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సరఫరా చేసినట్లు పెట్రోలియం శాఖ అధికారులు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నామని, బుక్ చేసిన 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తున్నామని అధికారులు వివరించారు.

పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు పీఎంయూవై లబ్దిదారులకు 85లక్షల వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. లాక్ డౌన్ వేళ ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(PMGKY) కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత పీఎంయూవై లబ్దిదారుల నుంచి గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిందన్నారు అధికారులు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెప్పిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 7.15కోట్ల మంది పీఎంయూవై లబ్దిదారుల ఖాతాల్లోకి రూ. 5వేల606 కోట్లు ట్రాన్సఫర్ అయ్యాయి. ఇక ఏప్రిల్ నెలలో 1.26 కోట్ల గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటికే 85లక్షల సిలిండర్లు డెలివరీ చేశారు.

2016 మే 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన(PMUY) పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియాలో ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద 5కోట్ల మంది పేద కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. 2019 సెప్టెంబర్ 7వ తేదీ నాటికి లబ్దిదారుల సంఖ్య 8 కోట్లకు పెరిగింది.

Also Read | స్నేహితుడిని సూట్‌కేస్‌లో పెట్టి ప్లాట్‌కు తీసుకొచ్చిన 17ఏళ్ల బాలుడు.. అపార్ట్ మెంట్ వాసుల్లో కరోనా కలవరం!