70ఏళ్లు దాటితే బ్యాంకు CEOలు ఇంటికే

బ్యాంకుల సీఈఓలు, పూర్తి కాల డైరెక్టర్ల గరిష్ఠ వయో పరిమితికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త ప్రతిపాదన

  • Published By: naveen ,Published On : June 13, 2020 / 07:03 AM IST
70ఏళ్లు దాటితే బ్యాంకు CEOలు ఇంటికే

బ్యాంకుల సీఈఓలు, పూర్తి కాల డైరెక్టర్ల గరిష్ఠ వయో పరిమితికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త ప్రతిపాదన

బ్యాంకుల సీఈఓలు, పూర్తి కాల డైరెక్టర్ల గరిష్ఠ వయో పరిమితికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. బ్యాంకు సీఈవోల వయోపరిమితిని 70ఏళ్లుగా ఫిక్స్ చేసింది. 70ఏళ్లు దాటితే బ్యాంకు సీఈవోలు ఇంటికి వెళ్లాల్సిందే. ఇక ప్రమోటర్ గ్రూప్‌ కి చెందినవారైతే 10 ఏళ్ల గరిష్ఠ పదవీకాలానికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకింగ్‌ రంగంలో పాలనను మెరుగుపరిచే ప్రణాళికల్లో భాగంగా ఆర్‌బీఐ ఈ ప్రతిపాదనలు చేసింది.

* ప్రమోటరు గ్రూప్ కి చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు(సీఈఓ), పూర్తి కాల డైరెక్టర్లు(డబ్ల్యూటీడీ) 10 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యాక వృత్తి నిపుణులకు ఆ యాజమాన్య నాయకత్వ పదవులను వదిలిపెట్టాల్సి ఉంటుంది.
* సీఈఓ/డబ్లూటీడీల గరిష్ఠ వయో పరిమితి 70 ఏళ్లు. ఆ తర్వాత పదవిలో కొనసాగరాదు. ఇక ఏ బ్యాంకులకా బ్యాంకులు అంతర్గత విధానంలో కనిష్ఠ వయోపరిమితిని నిర్ణయించుకోవచ్చు.
* ప్రమోటర్ లేదా మెజారిటీ వాటాదార్లకు డబ్ల్యూటీడీ లేదా సీఈఓగా పదేళ్ల పదవీ కాలం ఉండడం అనేది సబబైన సమయమే. ఆ తర్వాత వృత్తి నిపుణులు వస్తే.. మేనేజ్‌మెంట్‌ నుంచి యాజమాన్యాన్ని విడదీయడంతో పాటు.. వృత్తి నైపుణ్యాన్ని అందులో జొప్పించే సంప్రదాయాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
* ప్రమోటర్ కాని లేదా మెజారిటీ వాటా లేని వారు వరుసగా 15 ఏళ్ల పాటు డబ్ల్యూటీడీ లేదా సీఈఓగా ఉండొచ్చు.

ప్రైవేటు బ్యాంకుల ప్రమోటర్ల వాటాలపై సమీక్ష:
మరోవైపు బ్యాంకింగ్‌ రంగంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వాటి కార్పొరేట్‌ స్వరూపం, యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ సమీక్షించనుంది. ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్‌ పీకే మొహంతి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల బృందం ఈ సమీక్ష చేపడుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో యాజమాన్యానికి సంబంధించి నియంత్రణలు, లైసెన్స్‌ నిబంధనలను సమీక్షించాలని ప్యానెల్‌ను ఆర్‌బీఐ కోరింది. యాజమాన్యం అధిక నియంత్రణ, అంతర్గత విధానాలపైనా ప్యానెల్‌ దృష్టి సారించనుంది. అలాగే, తొలిదశలో/లైసెన్స్‌ మంజూరు చేసిన తర్వాత.. అనంతరం ప్రమోటర్ల వాటాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించి ప్యానెల్‌ తగిన సిఫారసులు చేయనుంది.