ఆర్థిక సాయం అక్కర్లేదు : టెలికంలకు రుణాలు చెల్లించే సత్తా ఉంది.. జియో లేఖ

  • Published By: sreehari ,Published On : October 31, 2019 / 01:02 PM IST
ఆర్థిక సాయం అక్కర్లేదు : టెలికంలకు రుణాలు చెల్లించే సత్తా ఉంది.. జియో లేఖ

రుణభారంతో కుంగిపోయిన టెలికం కంపెనీలు పన్ను చెల్లింపులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనను బిలియనీర్ ముఖేశ్ అంబానీ టెలికం సంస్థ రిలయన్స్ జియో తీవ్రంగా వ్యతిరేకించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు నెలల వ్యవధిలో బాధిత టెలికం కంపెనీలు బకాయిలను తప్పనిసరిగా డిపాజిట్ చేయాల్సిందేనని జియో నొక్కి చెప్పింది. కోర్టు ఆదేశాలనుసారం టెలికం కంపెనీలు తమ బకాయిలను సౌకర్యవంతంగా చెల్లించగల సామర్థ్యం ఉందని జియో స్పష్టం చేసింది.

ఈ మేరకు గురువారం (అక్టోబర్ 31, 2019) టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు జియో లేఖ రాసింది. టెలికం పరిశ్రమలో ఇద్దరు ఆపరేటర్లు విఫలమైనంత మాత్రాన మొత్తం టెలికం రంగంపై ప్రభావం పడిందనడం సరికాదని జియో గట్టిగా వాదించింది. సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) మంత్రికి లేఖ రాసిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఇండస్ట్రీ బాడీ అనడాన్ని జియో తప్పుబట్టింది. 

ప్రస్తుత టెలికం ఆపరేటర్లు ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని, తమ వైఫల్యాలకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయని రిలయన్స్ జియో విమర్శించింది. ఈ క్రమంలో టెలికం రంగంలో ఆర్థిక సంక్షోభంపై COAI మంత్రి రవిశంకర్ కు రాసిన లేఖలో జియో స్పందనను ప్రస్తావించలేదు. సర్దుబాటు స్థూల రాబడి (AGR)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై COAI తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది పరిశ్రమ మరింత పెట్టుబడులు పెట్టగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొంది. సేవా నాణ్యత క్షీణతకు దారితీస్తుందని, గుత్తాధిపత్యం, ప్రభుత్వ కార్యక్రమాలను దెబ్బతీస్తుందని తెలిపింది. దీనిపై మంత్రి రవిశంఖర్‌కు జియో లేఖ రాసింది.

తమ అభిప్రాయం కోసం ఎదురుచూడకుండా ‘అనవసరమైన తొందరపాటుతో సమర్పించిన COAI లేఖ’ అంటూ ఏ ఒక వాదనతో కూడా ఏకీభవించదని తెలిపింది. రిలయన్స్ జియో తన అభిప్రాయాల కోసం వేచి ఉండమని COAIను కోరినప్పటికీ అలా చేయలేదని మంత్రికి రాసిన లేఖలో జియో పేర్కొంది. 
Jio Letter