కరోనా దెబ్బ, 15వేల మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కార్ల కంపెనీ

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 213 దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి

  • Published By: naveen ,Published On : May 30, 2020 / 06:00 AM IST
కరోనా దెబ్బ, 15వేల మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కార్ల కంపెనీ

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 213 దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 213 దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. అదే సమయంలో కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలూ కుదేలయ్యాయి. కరోనా సృష్టించిన సంక్షోభంగా కారణంగా పలు ప్రముఖ కంపెనీలు, సంస్థలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి దారులు వెతుకుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతున్నాయి. కొన్ని కంపెనీలు ఏకంగా ఉద్యోగులనే తొలిగిస్తున్నాయి.

15వేల మంది ఉద్యోగులపై వేటు:
ఈ కంపెనీల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ కూడా చేరింది. అమ్మకాలు మందగించడంతో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీ శుక్రవారం(మే 29,2020) ప్రకటించింది. అలాగే కొన్ని ప్లాంట్లను పునర్వవస్థీకరణ చేయనున్నామనీ, ఇందుకు యూనియన్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది.

రూ.16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవడమే టార్గెట్:
వీరిలో ప్రధానంగా ఫ్రాన్స్‌కు చెందిన 4వేల 600 మంది ఉన్నారు. ఇతర దేశాల్లో 10 వేల మందికి పైగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.80 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న మూడేళ్లలో దాదాపు రూ.16,800 కోట్ల మేర ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నట్టుగా కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత 40 లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని 2024 నాటికి 33 లక్షలకు తగ్గించే యోచనలో ఉన్నట్టు వెల్లడించింది. ఉత్పత్తిలో కోత విధించి, మరింత లాభదాయకమైన మోడళ్లపై దృష్టి పెట్టనుంది.

12వేల మందిని తొలగించనున్న బోయింగ్:
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ కారణంగా విమానయాన రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ సుమారు 12వేల మందిని తొలగించేందుకు నిర్ణయించింది. రాబోయే కొద్ది నెలల్లో అనేక వేల ఉద్యోగాలను తొలగించనున్నామని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. 6వేల 770 అమెరికా ఉద్యోగులను ఈ వారంలో తొలగిస్తామనీ, మరో 5,520 మంది స్వచ్ఛందంగా సంస్థను వీడడానికి అంగీకరించారని వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకుంటామని చెప్పారు. అంతర్జాతీయంగా కూడా ఉద్యోగ కోతలు ఉంటాయన్నారు.

రోల్స్‌ రాయిస్‌లో వేల మందికి ఉద్వాసన:
యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ సైతం 9వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ ఆంక్షల సందర్భంగా తాము తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని,  ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తప్పలేదని తెలిపింది. తద్వారా 1.3 బిలియన్ డాలర్లను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెట్ ఇంజిన్ తయారీదారు ప్రకటించింది. మొత్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఒక వైపు మానవ హననం, మరో వైపు ఆర్థిక సంక్షోభంతో కార్పొరేట్‌ దిగ్గజాలు సైతం అతలా కుతలమవుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ రేటు గణనీయంగా పెరగనుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే పేదలు, వలస కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేకపోవడంతో ఆదాయం ఆగిపోయింది. దీంతో తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. 

Read: ఈఎంఐ కట్టలేదని ఏడు రెట్లు జరిమానా వేసిన బ్యాంకు