మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి

  • Published By: vamsi ,Published On : September 13, 2019 / 03:37 PM IST
మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రకటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్‌బీఐ. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ అమౌంట్ మొత్తాన్ని తగ్గించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ఎస్‌బీఐ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త నిర్ణయాలను అమల్లోకి తీసుకుని రానున్నట్లు ప్రకటించింది.

ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీసం రూ.3 వేలు ఉండాలి. ఇంతకుముందు ఇది రూ.5 వేలుగా ఉండేది. అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2 వేలు అకౌంట్ లో ఉంచాలి. గ్రామీణ ప్రాంతాలైతే కనీసం ఒక వెయ్యి రూపాయలు అకౌంట్ లో ఉంచుకోవాలని ఎస్‌బీఐ ప్రకటించింది.

అయితే కొత్తగా విధించిన నిబంధనలు పాటించకుంటే మాత్రం ఖాతాదారులకు ఛార్జీల మోత మోగించేందుకు కూడా తగిన నిర్ణయాలు తీసుకుంది ఎస్‌బీఐ. పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.1500 వరకు మాత్రమే ఉంటే అటువంటి అకౌంట్ల నుంచి రూ.10 వసూలు చేస్తారు. రూ.750 వరకు ఉంటే రూ.12.75వసూలు చేస్తారు. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం రూ.15 కట్టాల్సిందే. వీటికి జీఎస్టీ అధనంగా కలిపి కట్టాలి.

అంతేకాదు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయాలంటే ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. మూడుసార్లు లిమిట్ దాటితే అది రూ.100 అయినా కూడా డిపాజిట్ కు రూ.50 ఛార్జీ వసూలు చేస్తారు. అలాగే హోం బ్రాంచి నుంచి కాకుండా వేరే బ్రాంచి నుంచి డిపాజిట్ చేయాలంటే గరిష్టంగా రూ.2 లక్షలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

అకౌంట్ లో కనీసం రూ.25 వేలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు రెండు సార్లు ఉచితంగా నగదు తీసుకునే వీలు ఉంది. రూ.25 వేల నుంచి 50 వేల మధ్య బ్యాలెన్స్ ఉండే అకౌంట్ల నుంచి నెలకు 10 సార్లు విత్ డ్రా చేయవచ్చు. మినిమమ్ నెలకు రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంచే కస్టమర్లు ఎన్నిసార్లయినా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇక ఏటీఎం నుంచి అయితే మెట్రో నగరాల్లో నెలకు 10 సార్లు నగదును తీసుకోవచ్చు. నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయితే మాత్రం జీఎస్టీతో కలిపి రూ.168 ఫైన్ చెల్లించాలి. ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా డబ్బు తీసుకోవచ్చు. అయితే కార్డులో డబ్బు లేకుండా విత్ డ్రా చేసి తిరస్కరణకు గురైతే కూడా ఇకపై చార్జీలు విధించేందుకు ఎస్‌బీఐ సిద్ధం అవుతుంది.