అరబిందో ఫార్మాకు రూ.22 కోట్ల జరిమానా

  • Published By: chvmurthy ,Published On : September 24, 2019 / 02:41 AM IST
అరబిందో ఫార్మాకు రూ.22 కోట్ల జరిమానా

ప్రముఖ ఔషధ సంస్ధ  అరబిందో ఫార్మా ఆ సంస్ధ ప్రమోటర్లు , వీరితో సంబంధం ఉన్న  అనుబంధ సంస్ధలపై సెబీ రూ. 22 కోట్ల జరిమానా విధించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనతో ఈ చర్యతీసుకుంది.  కంపెనీ, దాని ప్రమోటర్‌ పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఆయన భార్య పీ సునీలా రాణి ఇంకా అనుసంధాన కంపెనీలపై మొత్తం రూ.22.7 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా జరిమానా చెల్లించాలని సోమవారం నాటి ఆర్డరు కాపీలో సెబీ ఆదేశించింది.

బల్క్‌ డ్రగ్‌, ఫినిష్డ్‌ ఫార్ములేషన్ల సరఫరా చేసేందుకు అరబిందో ఫారా ఫైజర్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. 2008లో జూలై 22 నుంచి డిసెంబరు 29 మధ్యలో ఈ ఒప్పందాలు జరిగాయి. అయితే అరబిందో మాత్రం 2009 మార్చి 3న విషయాన్ని బయటికి వెల్లడించింది.

2008 జులై నుంచి 2009 మార్చి మధ్య కాలంలో  బయటకు వెల్లడించని షేరు ధరను ప్రభావితం చేసే సమాచారం ఆధారంగా ప్రమోటర్లు వారితో అనుబంధం కలిగిన సంస్ధలు అరబిందో ఫార్మా షేర్ లో ట్రేడింగ్ చేసి లాభాలను పొందినట్లు సెబీ గుర్తించింది.

లిస్టెడ్‌ కంపెనీలు షేర్ల ధరలను ప్రభావితం చేసే ఏ సమాచారాన్నైనా ముందుగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు తెలపాల్పి ఉంటుంది. దశాబ్దం క్రితం ఫైజర్‌తో కుదుర్చుకున్న లైసెన్సింగ్‌, సరఫరా అగ్రిమెంట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అరబిందో ఫార్మా ఎనిమిది నెలలకు పైగా (2008 జూలై 22 నుంచి 2009 మార్చి 3 వరకు) బయటికి చెప్పకుండా తొక్కిపెట్టింది. సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు వెల్లడించకపోగా ఆ సమయంలో మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్న అరబిందో షేర్లను ప్రమోటర్లు, వారి  అనుబంధ కంపెనీలు భారీ సంఖ్యలో కొనుగోలు చేసినట్లు సెబీ గుర్తించింది. ఆ తర్వాత కాలంలో ధర పెరిగాక షేర్లను విక్రయించడం ద్వారా వీరు లాభాలు పొందినట్లు సెబీ పేర్కొంది.