బ్యాంకుల విలీనం: భారీ నష్టాల్లో మార్కెట్లు

  • Published By: vamsi ,Published On : September 3, 2019 / 11:23 AM IST
బ్యాంకుల విలీనం: భారీ నష్టాల్లో మార్కెట్లు

ప్రభుత్వ బ్యాంకుల వీలనం ప్రక్రియ మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టేసింది. అంతేకాదు ఆటో మొబైల్ విక్రయాలు తగ్గడం కూడా మార్కెట్లకు ప్రతీకూలంగా మారాయి. దీంతో దలాల్‌ స్ట్రీట్‌ లో సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా జీడీపీ 5 శాతం ఆరేళ్ల కనిష్టానికి చేరడంతో శని, ఆది, సోమ(వినాయక చవితి) సెలవుల తర్వాత మంగళవారం(03 సెప్టెంబర్ 2019) ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో బ్యాంకుల షేర్లు..  ఇన్వెస్టర్ల అమ్మకాలు  భారీగా పతనం అయ్యాయి. జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం వంటి ప్రతికూల అంశాలు మార్కెట్లను దెబ్బతీశాయి.

దీంతో స్టార్టింగ్ నుంచే  బలహీనంగా ఉన్న సూచీలు  మిడ్‌ సెషన్‌ తరువాత మరింత పతనమయ్యాయి.  ఒక దశలో 852 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ చివరికి 770  నష్టంతో 36652 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు పతనమై 10797వద్ద ముగిశాయి. 10800 స్థాయిని కూడా బ్రేక్‌ చేసింది నిఫ్టీ. ఒక్క ఐటీ తప్ప అన్నీ రంగాలు నష్టాల్లోనే ముగిశాయి.

పీఎస్‌యూ బ్యాంక్స్‌,  మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా, ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ   షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐసీఐసీఐ, ఐవోసీ, టైటాన్‌, అల్ట్రాటెక్‌, టాటా స్టీల్, ఇండస్‌ ఇండ్‌,  వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌,  ఐషర్‌, ఎంఅండ్‌ఎం, బీపీసీఎల్‌ నష్టపోయాయి. ఐడీబీఐ మాత్రం 7శాతం ఎగిసింది. మరోవైపు  టెక్‌ మహీంద్రా, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరో మోటో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌  లాభాలు చూశాయి.  డాలరు మారకంలో రూపాయి విలువ ఒక్కరోజునే  ఒకరూపాయి నష్టపోయి 72.28కి చేరుకుంది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు,  ఇండియన్‌, ఓరియంటల్‌ బ్యాంకు, కెనరా బ్యాంకు 5 నుంచి 12 శాతం కుప్పకూలగా.. పీఎన్‌బీ 9 శాతం, ఇండియన్ బ్యాంకు 8 శాతం,  కెనరా బ్యాంకు 8 శాతం నష్టపోయాయి. ఇండియన్‌ బ్యాంక్‌ లిమిటెడ్, 12.5 శాతం కుప్పకూలింది.