ఆర్థికమంత్రి విమర్శలకు రాజన్ దిమ్మతిరిగే కౌంటర్

  • Published By: venkaiahnaidu ,Published On : October 31, 2019 / 12:40 PM IST
ఆర్థికమంత్రి విమర్శలకు రాజన్ దిమ్మతిరిగే కౌంటర్

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కాలంలోనే ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి దిగజారిపోయిందని ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే నిర్మలా సీతారామన్‌ చేసిన విమర్శలకు రఘరామ్‌ రాజన్‌ దీటుగా బదులిచ్చారు.

న్యూయార్క్ లో సీఎన్ బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా వ్యాఖ్యల గురించి రాజన్ మాట్లాడారు. 2013 సెప్టెంబర్‌ నుంచి 2016 సెప్టెంబర్‌ వరకూ తన పదవీకాలం సాగగా, ఎక్కువ కాలం బీజేపీ ప్రభుత్వ హయాంలోనే పనిచేశానని గుర్తుచేశారు. బ్యాంకింగ్‌ రంగ ప్రక్షాళనకు తాను చర్యలు చేపట్టి అవి అసంపూర్తిగా ఉండగానే తాను ఆర్బీఐ గవర్నర్‌గా వైదొలిగానని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో తాను కేవలం 8 నెలలు పనిచేస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కిందే 26 నెలలు ఆర్బీఐ గవర్నర్‌ గా పనిచేసినట్లు రాజన్ గుర్తుచేశారు. ఈ అంశంపై రాజకీయ చర్చకు తాను దిగదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పటిష్ట ఆర్థిక వృద్ధి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల ప్రక్షాళన అవసరమని తాను అదే పనిచేశానని తెలిపారు.

ఆర్థిక సంక్షోభానికి ముందు తీసుకున్న రుణాలు పేరుకుపోవడంతో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగాయని, వాటిని ప్రక్షాళన చేసి బ్యాంకులకు తిరిగి మూలధన సమీకరణకు తోడ్పడకుంటే సమస్యలు ఎదురవుతాయని, తాను ఈ ప్రక్రియను చేపట్టి సగంలోనే ముగించాల్సి వచ్చిందని రాజన్‌ చెప్పారు. దేశం ప్రస్తుతం ఆర్థిక మందగమనంలో ఉందని చెబుతూ వృద్ధి రేటును పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అక్టోబర్-15,2019న కొలంబియా యూనివర్శిటీలో నిర్మలా సీతారమన్ మాట్లాడుతూ…ప్రధానమంత్రిగా మన్మోహన్,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్‌గా రఘురాం రాజన్ కాంబినేషన్ ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులుకు చెత్త దశ లేదని మీ ముందు ఉంచారు. ఆ సమయంలో మనలో ఎవరికీ దీని గురించి తెలియదు. 2011-2012లో ప్రభుత్వరంగ బ్యాంకుల బ్యాడ్ లోన్స్ రూ. 9,190 కోట్ల నుంచి 2013-2014లో రూ. 2.16 లక్షల కోట్లు పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. 2014 మే నెలలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని ఆమె అన్నారు. రాజన్ హయాంలో విపరీతంగా రుణాలు మంజూరు అయ్యాయన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా అప్పులు ఇచ్చేశారని నిర్మలా ఆరోపించారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి నిధుల కోసం ప్రభుత్వం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వాళ్లు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థకు జీవం పోసే ప్రయత్నం చేస్తున్నామనట్లు ఆర్థికమంత్రి చెప్పారు.