40శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు

40శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు

దీపావళి అంటేనే గిఫ్ట్‌ల పండుగ. అందులో ప్రత్యేకంగా ధన్‌తేరాస్ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేసి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలకు కొనుగోలు చేసేవాళ్లే లేకుండాపోయారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 40శాతం వరకూ కొనేవాళ్లు తగ్గిపోయారట. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ పరిస్థితి దేశమంతటా కనిపిస్తోంది. 

ధరలు అధికంగా ఉండటం ప్రభావం చూపాయని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి. శుక్రవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి, రూ.39,240గా నమోదైంది. 2018 ధన త్రయోదశి నాటితో పోలిస్తే ప్రస్తుత ధర 20 శాతం ఎక్కువగా ఉంది. అక్టోబరు 25 శుక్రవారం సాయంత్రం నాటికి సుమారు 6వేల కేజీల పసిడిని (రూ.2,500 కోట్లు) విక్రయించినట్లు అంచనా. గతేడాది ఇదే రోజున 17వేల కేజీల పసిడిని విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

దీంతో వ్యాపారం 35 నుంచి 40 శాతం వరకు తగ్గిపోయిందని వ్యాపారులకు తలలుపట్టుకుంటున్నారు. 2018లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి కూడా. అయితే పసిడి ధర అప్పటితో పోలిస్తే 10 గ్రా. రూ.6000 వరకూ ప్రస్తుతం ఎక్కువ. శుక్రవారం హైదరాబాద్‌లోని నగల షాపుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర రూ.39వేల 900గా కాగా.. 22 క్యారెట్ల ధర రూ.36వేల 850గా పలికింది. కిలో వెండి రూ.50వేల 600గా ఉంది.