చలికి గడ్డ కట్టని డీజిల్

  • Published By: madhu ,Published On : November 18, 2019 / 01:27 AM IST
చలికి గడ్డ కట్టని డీజిల్

ఎత్తయిన ప్రాంతాలు..ఎముకలు కొరికే చలి..విపరీతమైన మంచు..ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే సాహసమే. ఎందుకంటే చలికి డీజిల్ గడ్డ కట్టుకపోతోంది. ఫలితంగా మోటారు వాహనాలు ఆగిపోతుంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు వాహనదారులు. ఈ సమస్యలకు చెక్ పెట్టింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC). చలికాలంలోనూ గడ్డకట్టని ప్రత్యేక వింటర్ గ్రేడ్ డీజిల్‌ను సిద్ధం చేసింది. దీనిని 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. 

దీనివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని షా వెల్లడించారు. చలికాలంలోనూ రవాణా ఇబ్బందులు దూరమౌతాయని, పర్యాటక రంగానికి లబ్ది చేకూరుతుందన్నారు. 70 ఏళ్లుగా వెనుకబడిన లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రూ. 50 వేల కోట్లతో అక్కడ కొత్తగా జల విద్యుత్, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపడుతామన్నారు షా. 

ఈ ఇంధనాన్ని లద్దాఖ్‌లో షా వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. పానిపట్‌లోని ఐవోసీ ఫ్యాక్టరీ సిద్ధం చేసిన వింటర్ గ్రేడ్ డీజిల్ పోర్ పాయింట్ శీతాకాలంలో మైనస్ 33 డిగ్రీల సెల్సియస్ మేర ఉంటుందని, అందువల్ల ద్రవ లక్షణాన్ని కోల్పోదని అంటున్నారు. పైగా బీఎస్ – 6 గ్రేడ్ ప్రమాణాలను ఇది అందుకుందన్నారు. లద్దాఖ్, కార్గిల్, కాజా, కీలాంగ్ వంటి ఎత్తయిన ప్రాంతాల్లో టెంపరేచర్స్ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంటాయి. మార్గమధ్యంలోనే వాహనాలు మొరాయిస్తుంటాయి. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం ఈ సమస్యలు దూరం కానున్నాయి. 
Read More : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..వేడి పుట్టిస్తాయా