మొబైల్ వినియోగదారులకు షాక్, పెరగనున్న డేటా చార్జీలు

  • Published By: naveen ,Published On : August 25, 2020 / 11:20 AM IST
మొబైల్ వినియోగదారులకు షాక్, పెరగనున్న డేటా చార్జీలు

మొబైల్ వినిగియోదారులకు ఇది షాకిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే డేటా చార్జీలు, ఇతర సర్వీసుల ధరలు పెరగనున్నాయి. టారిఫ్ పెంపుపై భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈ మేరకు హింట్ ఇచ్చారు. రానున్న 6 నెలల్లో మొబైల్ సర్వీసుల ధరలు పెరుగుతాయని ఆయన చెప్పారు. తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల టెలికాం ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని వాపోయారు. 160 రూపాయలకే నెలకు 16జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు. అమెరికా లేదా యూరప్ లో లాగా 50 నుంచి 60 డాలర్లు ధరలు పెంచాలని అనుకోవడం లేదన్న మిట్టల్, అదే సమయంలో 2 డాలర్లకు నెలకు 16జీబీ డేటా కరెక్ట్ కాదన్నారు. రానున్న 6 నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్‌పీయూ) రూ.200 దాటొచ్చని అంచనా వేశారు.



మాకు రూ.300 ఏఆర్పీయూ కావాలి. డేటా కోసం అయితే రూ.100 సరిపోతుంది. అయితే టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని భారతీ ఎంటర్ ప్రైజస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తక ఆవిష్కరణలో మిట్టల్ అన్నారు. జూన్ 30 నాటికి తొలి క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.157కి పెరిగింది. డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచాక ఎయిర్ టెల్ కు ఈ మేరకు లాభం వచ్చింది. కష్ట కాలంలో టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని మిట్టల్ గుర్తు చేశారు. టెలికాం ఇండస్ట్రీ.. 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్నారు.



టెలికాంలో లేని వ్యాపారాలు కూడా డిజిటల్ కు మారాల్సిన అవసరం వచ్చింది. టెలికాం పరిశ్రమ మనుగడ సాగించాలంటే రానున్న 6 నెలల కాలంలో సాలిడ్ ఏఆర్పీయూ రావాల్సి ఉంది. రానున్న 6 నెలల కాలంలో ఏఆర్పీయూ రూ.200 క్రాస్ చేస్తామనే నమ్మకం ఉంది. రూ.250 ఐడియల్ గా ఉంటుంది అని మిట్టల్ అన్నారు.