అప్పట్లో ఒక సంచలనం: ఈ ఏడాది ఒకటే బుల్లి కారు అమ్ముడైంది

  • Published By: vamsi ,Published On : October 9, 2019 / 02:28 AM IST
అప్పట్లో ఒక సంచలనం: ఈ ఏడాది ఒకటే బుల్లి కారు అమ్ముడైంది

దేశీయ మార్కెట్లో సంచలనంగా ఎంట్రీ ఇచ్చిన చిన్న కారు టాటా నానో. రూ.లక్షకే టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకుని వచ్చిన ఈ కారుకు అప్పట్లో దేశీయవ్యాప్తంగా మంచి డిమాండ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇక ఈ కారు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 2019ఏడాదికి గాను నానో కారు 9 నెలల్లో కేవలం ఒక్కటే అమ్ముడు పోయింది.

టాటా మోటార్స్ కు చెందిన బుల్లి కారు నానో తొమ్మిది నెలల్లో ఒక్కటీ ఉత్పత్తి చేయలేదు. ఈ ఏడాది మొత్తంలో కేవలం ఫిబ్రవరి నెలలో మాత్రమే ఒక్కకారును అమ్మింది కంపెనీ. ఈ మేరకు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

సెప్టెంబర్ వరకు నానోకు సంబంధించి దేశీయంగా ఒక్క యూనిట్ ఉత్పత్తి జరగలేదు. గత 9 నెలల్లో ఒక్క యూనిట్ ను ఉత్పత్తి చేయలేదని, ఫిబ్రవరిలో మాత్రమే ఒక్క యూనిట్ అమ్మినట్లు కంపెనీ స్పష్టం చేసింది. 2008లో ఆటో ఎక్స్ పోలో నానోను ప్రదర్శించగా.. 2009 మార్చిలో మార్కెట్ లోకి వచ్చింది నానో అప్పట్లో ఈ కారు ఓ సంచలనం సృష్టించింది. రతన్ టాటా కలల కారుగా, ప్రజల కారుగా మార్కెట్లోకి విడుదలైంది. రూ. లక్షకే దేశంలో వచ్చిన మొదటి కారు ఇదే. అయితే కారు వచ్చిన కొద్ది రోజులకే అమ్మకాలు మాత్రం దారుణంగా పడిపోయాయి.

2018 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో టాటా మోటర్స్ కంపెనీ 297కార్లను ఉత్పత్తి చేయగా.. కేవలం 299 కార్లను కంపెనీ విక్రయించింది. దీంతో కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది టాటా మోటార్స్. 2020 ఏప్రిల్ తర్వాత కారును కంపెనీ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని సాంకేతిక సమస్యల కారుణంగా ఈ కారు మార్కెట్లో అనుకున్నంత హిట్ కాలేదు. తద్వారా కంపెనీ నష్టపోతోంది అని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.