రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు

  • Published By: chvmurthy ,Published On : March 14, 2020 / 02:38 AM IST
రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 ఎయిర్ పోర్టులు నిర్మించటానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్ చెప్పారు.  భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ లోని గుదిబండలో కొత్త విమానాశ్రయాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా 2020  కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన  మామునూరు విమానాశ్రయాన్ని సత్వరమే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఇది ఏ మాత్రం అడ్డంకి కాదని తెలిపారు. 

మామునూరుతోపాటు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, ఆదిలాబాద్ లోని పాత విమానాశ్రయాలను పునర్వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, అంతర్జాతీయ వైమానిక విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో పాత ఎయిర్‌పోర్టుల పునరుద్ధరణతోపాటు కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానించేందుకు హెలిపోర్ట్స్‌ తేనున్నట్లు తెలిపారు.(కోడి మాంసం తింటే కరోనా రాదు)

‘రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను కన్సల్టెంట్‌గా నియమించామని ఆయన చెప్పారు. వరంగల్‌ విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపంలోకి వచ్చేందుకు అన్ని శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. ఇది వస్తే రాష్ట్రంలో ప్రాంతీయ విమానయాన రంగానికి ఊతమిస్తుందని  కేటీఆర్ అన్నారు.  మెగా టెక్స్‌టైల్‌ పార్క్, ఐటీ హబ్‌కు తోడ్పాటు లభిస్తుంది. ‘ఉడాన్‌’లో భాగంగా వరంగల్‌ విమానాశ్రయాన్ని జత చేయాలని కేంద్రాన్ని కోరాం’అని చెప్పారు. భారత్‌లో తొలి అటానమస్‌ బగ్గీని ఆవిష్కరించిన అనంతరం అందులో కేటీఆర్‌ ప్రయాణించారు. ఇది డ్రైవర్‌ లేకుండానే నడుస్తుంది. 

రాష్ట్రవ్యాప్తంగా హెలిపోర్టులను అభివృద్ధి చేసి, మారుమూల ప్రాంతాలనూ కలిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి ఏరోస్పేస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ వో) సేవలు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలపై జీఎస్ టీని కొంత సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా సానుకూల స్పందన లభించిందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో విమాన విడిభాగాలను (ఓఈఎం) తయారు చేసే సంస్థలు తమ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నామనికేటీఆర్ చెప్పారు. ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ తో కలిసి మెడిసిన్స్  ఫ్రం ది స్కై ను ప్రారంభించామని…. గత అయిదేళ్లుగా తెలంగాణలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధి చెందుతోందని అన్నారు. సికోర్ స్కై, బోయింగ్ జీఈ, సాఫ్రాన్  రఫేల్  ఎల్బిట్  లాంటి సంస్థలు హైదరాబాద్ తమ కేంద్రాలను ఏర్పాటు చేశాయని మంత్రి వివరించారు. 

అదానీ గ్రూపు, కల్యాణి గ్రూపుతో కలిసి ఇక్కడ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. హైదరాబాద్  నుంచి 25 పెద్ద కంపెనీలు, వెయ్యికి పైగా ఎంఎస్ ఎంఈలు ఓఈఎంల తయారీలో పాలుపంచుకుంటున్నాయి.ఆదిభట్ల ఏరోస్పేస్ ఎస్ ఈజెడ్ నాదర్ గుల్ ఏరోస్పేస్  పార్క్, జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్, అదానీ ఏరోస్పేస్ పార్క్, హార్డ్ ర్ పార్కులున్నాయి. సాధారణ ఇంజినీరింగ్ పరిశ్రమ కోసం 50 పార్కులు ఉన్నాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ కు చెందిన సంస్థలు ఇక్కడ కోర్సులు ప్రారంభించాయి అని కేటీఆర్ తెలిపారు.