మోడీ చేతిలో ఇంటర్నెట్ నిలిపివేత ‘అస్త్రం’.. గంటకు రూ.2.5 కోట్ల నష్టం!

  • Published By: sreehari ,Published On : December 28, 2019 / 08:36 AM IST
మోడీ చేతిలో ఇంటర్నెట్ నిలిపివేత ‘అస్త్రం’.. గంటకు రూ.2.5 కోట్ల నష్టం!

నిరసనను ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి చిక్కిన కొత్త ఆయుధం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం. ఈ యేడాది కనీసం వందచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయించింది మోడీ ప్రభుత్వం. తక్షణ పరిష్కారంగా ఇది బాగానే పనిచేస్తున్నా, మొబైల్ ఆపరేటర్లకు మాత్రం ఆర్ధికంగా భారమవుతోంది. మోడీ ప్రభుత్వ ఇంటర్నెట్ నిలిపివేతతో గంటలకు రెండున్నర కోట్ల మేర మొబైల్ ఆపరేటర్లు నష్టపోతున్నారు.

కాశ్మీర్‌లో నెలల తరబడి ఇంటర్నెట్ లేదు. పౌరసత్వ సవరణ చట్టం మీద గళమొత్తుతున్న జనం వీధుల్లోకి వచ్చారు. ప్రదర్శనలు చేస్తున్నారు. మూడు వారాలుగా ఆందోళనలు తగ్గడంలేదు. ఈ నరసన ‘ఉదంతం’ కాకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తోంది. ఢిల్లీ మొదలు, ఉత్తరప్రదేశ్ వరకు చాలాచోట్ల రోజల తరబడి ఇంటర్నెట్ అందడంలేదు. ఆన్ లైన్ ప్రచారాన్ని కట్టడిచేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

కొంతమేర ఈ టెక్నిక్ విజయవంతం అయినట్లే కనిపించింది. ఈలోగా జనాభా లెక్కల కోసం ప్రభుత్వం ముందుకెళ్లడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఎన్నార్సీకి జనాభా జాబితా అన్నది తొలిమెట్టని, ఇది ముస్లిం వ్యతిరేకమని విమర్శకులు నిరసిస్తున్నారు. ఆ ఆందోళలను అడ్డుకోవడానికి పోలీసులను మోహరిస్తున్నారు. ఎక్కడ ప్రదర్శనలు జరిగినా… అక్కడ వెంటనే ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నారు.

ఉద్యమకారులు ఇనస్టాగ్రామ్, టిక్ టాక్ లను వాడుతూ జనాలను రెచ్చగొడుతున్నారన్నది ప్రభుత్వ ఆరోపణ. అందుకే డేటా సేవల నిలుపుదల అన్నది అధికార వర్గాల మాట. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని అంటున్నారు నిరసన కారులు.శుక్రవారం, అంతెందుకు, ఉత్తరప్రదేశ్ లో 18 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సిందిగా అధికార వర్గాల నుంచి ఆపరేటర్లకు ఆదేశాలొచ్చాయి. భారతీయులు నెలకు యావరేజ్ గా 9.8 జీబీ డేటాను వాడేస్తున్నారు.

ప్రపంచంలోనే ఈ వాడకం చాలా ఎక్కువ. జియో వచ్చినతర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు డేటా ఛార్జీలు పెరిగినా, వినియోగం మాత్రం తగ్గడంలేదు. అలాగని, ఎక్కడ ఏంజరిగినా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం మొదటి ప్రతిచర్యకాకూడదని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) అంటోంది.

ఇందులో ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, రియలన్స్ లు సభ్యులు. పోటీవల్ల ఇప్పటికే నష్టాలను మోస్తున్న కంపెనీలకు డేటా సేవలను నిలిపివేయడం వల్ల మరింత నష్టం వస్తోందని, పెరుగుతున్న భారం గురించి ఇప్పటికే ప్రభుత్వానికి తెలియ చేశాని అంటున్నారు. కాకపోతే నిరసన ప్రదర్శనలను ఏదోలా అడ్డుకోవాలని అంటున్న ప్రభుత్వం సెల్యూలర్ అపరేటర్ల మొరను ఆలకించే మూడ్ లో లేదు.