విశాఖను ప్రపంచ స్థాయి నగరాల జాబితాలో చేర్చాలని జగన్ లక్ష్యం : మేకపాటి

  • Published By: chvmurthy ,Published On : January 30, 2020 / 02:50 PM IST
విశాఖను ప్రపంచ స్థాయి నగరాల జాబితాలో చేర్చాలని జగన్ లక్ష్యం :  మేకపాటి

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు యూఎస్ సిద్ధంగా ఉందని  పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  చెప్పారు ఆయన గురువారం ‘యూఎస్ కమర్షియల్ ఎఫైర్స్ కౌన్సిలర్ మనోజ్ దేశాయ్ బృందంతో సమావేశం అయ్యారు. ప్రపంచస్థాయి మేటి నగరాలలో విశాఖను నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని మంత్రి మేకపాటి అన్నారు.  ఏపీ పారిశ్రామికాభివృద్ధికి యూఎస్ భాగస్వామ్యం మరింత దోహదం చేస్తుందని యూఎస్ ప్రతినిధుల బృందం తెలిపింది. పరిశ్రమల స్థాపనకు ఏపీ స్వర్గధామమని యూఎస్ ప్రతినిధుల బృందం  ప్రశంసించింది.
 

ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా అనువైన వాతావరణం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికరంగంలో అగ్రశ్రేణిలో నిలిపేదిశగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు వెళుతోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. పారిశ్రామిక రంగాన్ని ప్రజలకు చేరువ చేసేలా వ్యవసాయరంగంతోనూ మమేకం చేసే బృహత్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని మంత్రి యూఎస్ ప్రతినిధులకు తెలిపారు.

 

అంతకుముందు హైదరాబాద్ లో మంత్రి మేకపాటితో  సమావేశమైనప్పుడు మంత్రి చేసిన విజ్ఞప్తి మేరకు యూఎస్ కాన్సులేట్ జనరల్, ప్రతినిధులు విశాఖను సందర్శించి వచ్చినట్లు మంత్రికి తెలిపారు. విమానాశ్రయాలు, పోర్టులు, తీర ప్రాంతం, పర్యాటకం ఇలా అన్ని రంగాల్లో అద్భుత నగరం విశాఖ అని ప్రతినిధులు విశాఖ నగరాన్ని ప్రశంసించారు. పరిశ్రమలు, ఐ.టీ, స్కిల్ డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, అగ్రి టెక్ వంటి సమగ్ర రంగాలపై దృష్టి పెట్టి ప్రోత్సహిస్తే విశాఖ త్వరలోనే దేశంలోని మొదటి మూడు నగరాల జాబితాలో నిలుస్తుందని యూఎస్ ప్రతినిధులు మంత్రికి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

ఏపీ కేంద్రంగా ఏ రంగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందిస్తామని మంత్రి యూఎస్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. పారిశ్రామికరంగంలో సామాన్య ప్రజలు భాగస్వామ్యమయ్యేలా వ్యవసాయం, పాడి,పరిశ్రమల వంటి అనుబంధ రంగాలను ఇలా అన్నింటిని సమ్మిళితం చేయడం దేశంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయమని మంత్రి ప్రతినిధులతో అన్నారు. 

 

విశాఖలో త్వరలో సెమినార్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరడంపై యూఎస్ ప్రతినిధుల బృందం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, కమర్షియల్ ఎఫైర్స్ కౌన్సిలర్ మనోజ్ దేశాయ్, కమర్షియల్ స్పెషలిటస్ట్ ఇమ్మాన్యుయేల్, యూఎస్ కాన్సులేట్ జనరల్ (పొలిటికల్ అండ్ ఎకనమిక్) సిబ ప్రసాద త్రిపతి,  తదితర యూఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.